Winter Health Tips for Sugar Patients:రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయులకు పడిపోతున్నాయి. ఫలితంగా శ్వాసకోశ, వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇంకా గాలిలో తేమశాతం తగ్గడంతో పలువురిలో చర్మం పొడిబారి దురదలు వచ్చి పుండ్లు వస్తున్నాయి. అయితే, ఈ సమస్య మధుమేహ రోగులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని షుగర్ వ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ పీవీ రావు హెచ్చిరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను నివారించవచ్చని ఆయన సూచించారు.
గాయాలపై నిర్లక్ష్యం వద్దు
శీతాకాలంలో శరీరం పొడిబారటం వల్ల మధుమేహులకు ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంపై దురద పుట్టినప్పుడు.. ఏ మాత్రం రుద్దినా పుండ్లుగా మారతాయని అంటున్నారు. ఇంకా ఈ కాలంలో చర్మంపై ఏర్పడిన పుండ్లు త్వరగా మానిపోయే అవకాశం ఉండదని వివరిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రదేశాల్లో ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే మానని గాయాల్లా మారతాయని హెచ్చరిస్తున్నారు.
జిడ్డు తక్కువ క్రీములే మేలు
అమెరికా వంటి శీతల దేశాల్లో వినియోగించే జిడ్డు ఎక్కువగా ఉండే క్రీములు మన వాతావరణానికి సరిపోవని ఆయన తెలిపారు. మనం వాటర్ సాల్యుబుల్ కోల్డ్ క్రీములు మాత్రమే ఉపయోగించాలని వివరించారు. ఇవి రాసినప్పుడు చర్మం మృదువుగా ఉంటుందని... స్నానం చేసినప్పుడు ఆ క్రీమ్ అంతా పోతుందని చెబుతున్నారు. అయితే, జిడ్డు ఎక్కువగా ఉండే క్రీములు వాడితే అరచేతులు, అరికాళ్లు, పొట్ట భాగంలో ఉండిపోతుందని.. కొన్ని రోజుల తర్వాత ఫంగల్ ఇన్‌ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కొంతమందికి చలికాలంలోనూ కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో తేమ ఉంటుందని.. అలాంటి వారు టాల్కమ్ పౌడర్లు వాడాలని సూచిస్తున్నారు. ఇంకా గ్లిజరిన్ ద్రవాలతో కూడిన సబ్బులను వినియోగిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు.
నీళ్లు ఎక్కువగా తాగాలట
చలికాలంలో సాధారణ వ్యక్తులతోపాటు మధుమేహ బాధితులూ దాహం వేయడం లేదని నీళ్లు తక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై చర్మం పొడిబారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా దశలవారీగా కనీసం 2 లీటర్ల వరకు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని.. నీటిశాతం ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.