Does Alcohol Cure Cold:మనలో చాలా మందికి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆల్కహాల్ పార్టీ ఉండాల్సిందే. ఇంకా ఉద్యోగం, ప్రమోషన్ వచ్చినా.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికినా, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పినా పార్టీ చేసుకోవాల్సిందే. ఇంకా ఈ మద్యం ఎంతోమంది జేబులతో పాటు ఆరోగ్యాన్నీ గుల్లబారుస్తోందని నిపుణులు అంటున్నారు. కాలేయం, నాడులు, మెదడు దెబ్బతినటమే కాకుండా.. జబ్బుల బారినపడకుండా కాపాడే రోగనిరోధకశక్తినీ తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా ఇన్‌ఫెక్షన్లు త్వరగా రావటానికి, ఒకపట్టాన తగ్గకపోవటానికి.. చివరికి కొన్నిరకాల క్యాన్సర్లకూ దారితీస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యానికీ రోగనిరోధకశక్తికీ ఉన్న సంబంధం ఏంటో ప్రముఖ ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు వివరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ వ్యాధులు సోకకుండా రోగనిరోధకశక్తి నిరంతరం మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివి దాడి చేసినప్పుడు ఇది వాటిని గుర్తించడమే కాకుండా వాటిని ఎదుర్కొని సమర్థంగా తిప్పికొడుతుందని అంటున్నారు. ఇది మన శరీరంలో మెదడు తర్వాత రోగనిరోధక వ్యవస్థే అత్యంత సంక్లిష్టమైందని వివరిస్తున్నారు. దీన్ని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చని వెల్లడిస్తున్నారు.
1. సహజ వ్యవస్థ (ఇన్నేట్). ఇది స్వతహాగానే మనకు లభిస్తుందని.. హానికారకాలను ఎదుర్కోవటంలో ముందువరుసలో నిలుస్తుందని అంటున్నారు. ఇది తక్షణమే స్పందించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములు ఒంట్లోకి ప్రవేశించగానే దీనిలో భాగమైన సహజ హంతక (ఎన్‌కే) కణాలు, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, మాక్రోఫేజస్, డెండ్రిటిక్ కణాల వంటి తెల్ల రక్తకణాలు వెంటనే స్పందించి, చంపటానికి ప్రయత్నిస్తాయని వివరిస్తున్నారు. ఇవి వ్యాధికారక క్రిముల అణువుల తీరుతెన్నులనూ గుర్తించడమే కాకుండా.. వాటిని మింగేస్తాయని చెబుతున్నారు. ఈ సహజ రోగనిరోధక కణాలు సైటోకైన్లు, కీమోకైన్ల వంటి వాటినీ విడుదల చేసి వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) తగ్గించడానికి సహాయ పడతాయని అంటున్నారు.
2. సంచిత వ్యవస్థ (అడాప్టివ్). ఇది ఆయా రకాల బ్యాక్టీరియా, వైరస్‌లను తుదముట్టించటానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్లను గుర్తించి, వాటిని ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ ప్రత్యేకమైన యాంటీబాడీలను సృష్టిస్తుందని వివరిస్తున్నారు. చికున్‌గన్యా యాంటీబాడీ, డెంగీ యాంటీబాడీల వంటివన్నీ ఇలాంటివేనని చెబుతున్నారు. ఇంకా ఇవి అప్పటికప్పుడు ఇన్‌ఫెక్షన్ పనిపట్టటమే కాకుండా దాన్ని గుర్తుపెట్టుకుంటాయని తెలిపారు. ఫలితంగా తిరిగి ఎప్పుడైనా ఆ ఇన్‌ఫెక్షన్ దాడిచేసినప్పుడు విడుదలై, దాన్ని కట్టడి చేస్తాయని పేర్కొన్నారు. దీంతో పాటు సంచిత నిరోధక వ్యవస్థలోనూ సెల్-మీడియేటరీ, హ్యూమోరల్ అని మళ్లీ రెండు రకాలు కనిపిస్తాయని వెల్లడిస్తున్నారు. ఇవి సెల్-మీడియేటరీ రకంలో టి కణాలు.. హ్యూమోరల్ రకంలో బి కణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టి కణాలు బ్యాక్టీరియాను తినేస్తుంటే.. బి కణాల నుంచి పుట్టుకొచ్చే యాంటీబాడీలు బ్యాక్టీరియా వృద్ధిని నిలువరిస్తాయని చెబుతున్నారు.
"మద్యం ముందుగా జీర్ణకోశ వ్యవస్థ మీదే ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు గోడల్లో పైపొరను.. అక్కడ ఉండే టి కణాలు, న్యూట్రోఫిల్స్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా జీర్ణకోశం, రక్తం మధ్య ఆడ్డుగా ఉండే పొర దెబ్బతిని.. పేగుల్లోని సూక్ష్మక్రిములు రక్తంలోకి చేరతాయి. ఫలితంగా ఇతర అవయవాల్లోనూ వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపితం అవుతుంది. ఇంకా మద్యం అలవాటు గలవారికి రక్తంలోకి ఇన్‌ఫెక్షన్ వ్యాపించే (సెప్సిస్) ముప్పూ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి కోలుకోవటానికీ ఎక్కువ సమయమే పట్టడమే కాకుండా.. మరణాలూ ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇంకా మద్యంతో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సైతం అస్తవ్యస్తం అవుతుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థ పరిపక్వం కావటానికి, తగు విధంగా మారటానికి ట్రైనింగ్ ఇస్తాయి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా అస్తవ్యస్తమైతే రోగనిరోధక వ్యవస్థ కూడా దారి తప్పుతుంది. మంచి బ్యాక్టీరియాకూ రోగనిరోధక వ్యవస్థకూ మధ్య సమాచార వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది."
--డాక్టర్ ఎం.వి రావు, కన్సల్టెంట్ ఫిజిషియన్