Tips To Remove Yellow Stains in Utensils :దాదాపు మనం వండే ప్రతి కర్రీలోనూ పసుపు వేస్తుంటాం. ఇలా పసుపు వేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత పాత్రల లోపలి వైపు పసుపు పచ్చగా మారుతుంది. దీనివల్ల పాత్రలు మెరుపును కోల్పోతాయి. అలాగే చూడటానికి కూడా అంతగా బాగోవు. అయితే, చాలా మంది ఈ మరకలను తొలగించడానికి స్టీల్ స్క్రబ్బర్‌తో బాగా రుద్దుతుంటారు. అయినా కూడా ఫలితం కనిపించదు. మరి ఈ మొండి మరకల్ని తొలగించడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! కొన్ని టిప్స్ పాటించడం వల్ల పసుపు మరకలను మాయం చేసి, పాత్రలను తళతళ మెరిసేలా చేయొచ్చని నిపుణులంటున్నారు. ఆ టిప్స్ మీ కోసం!
గ్లిజరిన్‌తో :ఒక గిన్నెలో రెండు కప్పుల నీటికి, పావు కప్పు గ్లిజరిన్, మరో పావు కప్పు లిక్విడ్ సోప్‌ను కలిపి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ మిశ్రమంలో ఓ క్లాత్ ముంచి.. పసుపు మరకలున్న పాత్ర లోపలి భాగంలో రుద్దండి. 15 నిమిషాల తర్వాత డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో ఒకసారి రుద్ది.. వేడి నీటితో క్లీన్ చేస్తే మరక వదిలిపోతుంది.
నిమ్మకాయ :నిమ్మకాయలో ఉండే ఆమ్ల గుణాలకు ఎలాంటి మొండి మరకలనైనా తొలగించే శక్తి ఉంటుంది. అందుకే దీనిని సహజ క్లీనర్ అని అంటారు. వేడినీళ్లలో కొంచెం నిమ్మరసం కలిపి.. ఆ మిశ్రమాన్ని పసుపు మరకలున్న పాత్రలో నింపాలి. నైట్ మొత్తం అలాగే ఉంచి ఉదయాన్నే అన్ని గిన్నెలతో పాటు క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పాత్రలు కొత్తదానిలా మెరిసిపోతాయి. ఇక్కడ నిమ్మరసానికి బదులు వెనిగర్ కూడా వాడచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కిచెన్ కత్తులు ఎక్కువ కాలం మన్నాలంటే..!
బేకింగ్ సోడా పేస్ట్ :బేకింగ్ సోడాలో కొద్దికొద్దిగా వాటర్ పోస్తూ పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పసుపు మరకలున్న పాత్ర లోపలి వైపు పూయాలి. అరగంట తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది సాధారణ డిష్‌వాష్ లిక్విడ్‌తో క్లీన్ చేస్తే పసుపు మరక వదిలిపోతుంది. 2019లో "Journal of Consumer Science"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గిన్నెలు, పాత్రలపై పసుపు మరకలను సమర్థవంతంగా తొలగించడానికి బేకింగ్ సోడా పేస్ట్ బెస్ట్ ఆప్షన్ అని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చెందిన 'డాక్టర్ జాన్ స్మిత్' పాల్గొన్నారు. స్టెయిన్లెస్ స్టీల్, పాలిష్డ్ అల్యూమినియం పాత్రలపై పసుపు మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా పేస్ట్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో :ఈ రసాయనం ఉపయోగించి కూడా గిన్నెలు, పాత్రలపైన ఉన్న పసుపు మరకల్ని తొలగించచ్చు. పసుపు మరకలున్న చోట కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వేసి.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. తర్వాత శుభ్రంగా కడిగితే మంచి ఫలితం ఉంటుంది.