Simple Tips To Stop White Hair : జుట్టు రంగు మారడం అనేది ఒక సహజ సిద్ధ ప్రక్రియ. వయసు పెరిగే కొద్దీ జుట్టు రంగు మారడం జరుగుతుంది. నల్లగా ఉన్న జుట్టు వయసు ప్రభావంతో తెల్లగా మారుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు తెల్లబడటాన్ని గమనించవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, వాడే హెయిర్ ప్రోడక్టులు తదితరాలు. ఈ నేపథ్యంలో వెంట్రుకలు తెల్లబడటాన్ని ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇందులో భాగంగా పండ్లు, కూరగాయలు, పప్పులు, ఆకుకూరలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని మూలకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా అవి త్వరగా తెల్లబడకుండా కాపాడతాయి.
పొగతాగడం మానేయండి
వెంట్రుకలు తెల్లబడటానికి పొగతాగడం కూడా ఒక కారణం కావచ్చు. నేరుగా పొగతాగడం లేదా పొగ ప్రభావానికి లోనుకావడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పొగకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. దీని వల్ల వెంట్రుకల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
ఒత్తిడిని నియంత్రించుకోండి
మారిన పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ఒత్తిడికి గురవడం అనేది ప్రస్తుతం మామూలు అయిపోయింది. అయితే ఒత్తిడి వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడిని దూరం చేసే వ్యాయామం, ధ్యానం, యోగాలతో పాటు ఇతర శారీరక శ్రమ చేసే కార్యక్రమాలపై దృష్టి సారించడం ఉత్తమం.
సూర్యుడి నుంచి జుట్టును రక్షించుకోండి
వెంట్రుకలు తెల్లబడటానికి ఎక్కువగా ఎండకు ఉండటం కూడా కారణం కావచ్చు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ లేదా యూవీ కిరణాలు వెంట్రుకలు నష్టపోవడమే కాకుండా తెల్లబడటానికి కారణం కావచ్చు. కాబట్టి ఎక్కువగా ఎండకు గురికాకుండా జాగ్రత్తలు పాటించడమే కాకుండా ఎస్పీఎఫ్ కలిగిన హెయిర్ ప్రోడక్ట్లను వాడటం ఉత్తమం.
హెయిర్ ట్రీట్మెంట్కు దూరంగా ఉండండి
అతిగా హెయిర్ డైలు వాడటం, రకరకాల చికిత్సలు, వెంట్రుకలను స్టైల్‌గా కనిపించేలా చెయ్యడానికి వేడి వస్తువులను వాడటం లాంటి అనేక కారణాలు కూడా వెంట్రుకలు తెల్లబడటానికి కారణం కావచ్చు. రసాయనాలతో కూడిన ట్రీట్మెంట్లు కాకుండా సహజసిద్ధ పద్ధతుల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.