Side effects of wearing Kajal :అమ్మాయిలు ఎక్కువగా వాడే మేకప్ ఐటమ్స్‌లో కాటుక కూడా ఒకటి. మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా సింపుల్‌గా కళ్లకు కాస్త కాటుక పెట్టుకుంటే.. అందం రెట్టింపవుతుందని భావిస్తారు. అందుకే చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు కాటుక అప్లై చేసుకుంటారు. అయితే, ఒకప్పుడు ఇంట్లోనే సహజ సిద్ధంగా కాటుక తయారు చేసి ఉపయోగించేవారు. కానీ, ప్రస్తుత ఆధునిక కాలంలో ఇంట్లో కాటుక చేయడం రాక.. మార్కెట్లో లభించే కాటుక డబ్బాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలాంటి కమర్షియల్ కాటుకల వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రముఖ సౌందర్య నిపుణురాలు 'డాక్టర్ శైలజ సూరపనేని' చెబుతున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కళ్లు అందంగా కనిపిస్తాయని.. వాటిల్లోకి చేరిన దుమ్ము పోతుందని, కళ్ల ఆరోగ్యానికి మంచిదని.. ఒకప్పుడు ఇంట్లోనే తయారు చేసిన కాటుక మహిళలు పెట్టుకునేవారు. కాటుకని స్వచ్ఛమైన ఆముదం, నెయ్యితో తయారుచేసేవారు. కానీ, ప్రస్తుతం బయట మార్కెట్లో లభించేవన్నీ కమర్షియల్ కాటుకలే. కంపెనీలు కాటుక తయారు చేయడానికి లెడ్ వంటి ఇతర రసాయనాలు వాడతారు. అలాగే నిల్వ ఉండటానికి పారాబెన్స్, భారలోహాలను ఉపయోగిస్తారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సూచిస్తున్నారు.
"ప్రతి రోజు కాటుక పెట్టుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులోని లెడ్ శరీరంలో ఇంకి మెదడు, ఎముకలపై దుష్ప్రభావం చూపుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తలెత్తవచ్చు. అలాగే మన కంటి కింది కనురెప్పల్లో నూనెగ్రంథులు ఉంటాయి. ఇవి నీటిని విడుదల చేసి, కళ్లకు తేమ అందేలా కాపాడతాయి. మనం కెమికల్స్‌తో కూడిన కాటుక రాయడం వల్ల అవి తెరుచుకోవు. దీంతో కంటికి తగినంత తేమ అందక కళ్లు పొడిబారతాయి."- డాక్టర్ శైలజ సూరపనేని (సౌందర్య నిపుణురాలు)
పిల్లలకు రిస్క్ ఎక్కువ :ఎక్కువగా కాటుక ఉపయోగించే వారిలో కంటికి సంబంధించిన అలర్జీలు, గ్లకోమా, కార్నియల్ అల్సర్లు వంటివి వస్తాయి. ఇంకా పిల్లల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంటుందని.. వారిలో నాడీవ్యవస్థపై ప్రభావం పడి నేర్చుకోవడం ఆలస్యమవడం, ప్రవర్తనా సమస్యలుతీవ్రమైతే కోమాలోకీ వెళ్లొచ్చని సూచిస్తున్నారు. కాబట్టి, రోజూ కాటుక పెట్టకపోవడమే చాలా మంచిదంటున్నారు.