Rice Vs Chapati Which is Better for Diabetes :వయసుతో సంబంధం లేకుండా నేటి జనరేషన్లో అందరినీ వేధిస్తోన్న సమస్య డయాబెటిస్. ఇక ఒక్కసారి షుగర్ ఎటాక్ అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తినే తిండిని పూర్తిగా తగ్గించుకోవాలి. ఒకవేళ ఏదైనా తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తినాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. ఏది తింటే షుగర్ ఎక్కువ, తక్కువ అవుతుందో తెలియదు. కాబట్టి షుగర్ పేషెంట్లు తినే ఆహారం విషయంలో కచ్చితంగా ఉంటారు. ఇదిలా ఉంటే మధుమేహంతో బాధపడుతున్న చాలా మంది ఓ పూట అన్నం తింటే మిగిలిన రెండు పూటలు చపాతీలు తింటుంటారు. ఇలా చపాతీలు తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. మరి, నిజంగానే షుగర్ సమస్య ఉన్న వారు అన్నానికి బదులుగా చపాతీలు తింటే మేలు చేస్తుందా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇలా చేస్తే మంచిదట : క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, శరీర అవసరాలకు తగిన పోషకాహారం, శారీరక శ్రమ వంటివాటితో చక్కెర వ్యాధి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా తమకంటూ ఓ ప్రత్యేకమైన ఆహారపట్టికను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేసుకోవాలంటే ముందు ఎత్తుకు తగ్గ బరువున్నారో లేదో చూసుకోమంటున్నారు. ఒకవేళబరువు తక్కువ ఉంటే... సాధారణ స్థాయికి పెరగమని.. ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడానికి ప్రయత్నించమంటున్నారు. అలానే మీరు రోజంతా ఎలాంటి శారరీక శ్రమ చేస్తారు? అందుకు ఎంత మేర శక్తి అవసరం అవుతుందన్న విషయాలను కెలొరీల్లో నిర్ధరించుకుని ఆహారరూపంలో తీసుకోవాలంటున్నారు. డయాబెటిస్ పేషెంట్లు ఉపయోగించే ట్యాబెట్లు, ఇన్సులిన్ డోసు అందరికీ ఒకలా ఉండదని చెబుతున్నారు.
ఏది తింటే మంచిది: ఇక రక్తంలో గ్లూకోజ్ స్థాయుల నియంత్రణకు అన్నం, చపాతీల్లో ఏది తిన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. శరీరానికి సరిపడా శక్తికి తగినట్లు ఆ పూటకి సరిపడా కేలరీలు తీసుకుంటున్నామో లేదో చూసుకుంటే చాలంటున్నారు. మొదటి నుంచీ మీ ఆహారపుటలవాట్లకు భిన్నంగా ఏదీ బలవంతంగా తినక్కర్లేదని సూచిస్తున్నారు.