Rest for Brain: మీరు గమినించారో లేదో.. కంప్యూటర్ను కూడా మనం కంటిన్యూగా పని చేయించము. దానికి రెస్ట్ ఇవ్వకపోతే త్వరగా పాడైపోతుందని మనకు తెలుసు. మరి.. ఇదే సూత్రం మెదడుకు వర్తించదా? ఆ విషయం మనకు తెలియదా? తెలుసు.. కానీ మనలో చాలా మంది పట్టించుకోరు. బ్రెయిన్‌కు రెస్ట్ ఇవ్వాలనే విషయాన్నే మరిచిపోతారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు. మెదడుకు చక్కటి విరామం ఇస్తే.. మరింత యాక్టివ్‌గా పనిచేయడంతోపాటు.. క్రియేటివిటీతో ఆలోచిస్తుందని చెబుతోంది లెక్సిస్నెక్సిస్ సర్వే. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మంచి నిద్ర :ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం ఎంత అవసరమో.. శరీరానికి తగినంత నిద్ర కూడా అవసరమే. మనిషి రోజుల్లో కనీసం 7 గంటలైనా నిద్ర పోవాలని సూచిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రతి రాత్రి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో.. గుండెపోటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి నిరాశతో సహా పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజులో తగినంత నిద్ర పోవడం ముఖ్యం.
శారీరక వ్యాయామం:శరీరం ఆరోగ్యంగా ఉండటానికే కాదు.. బ్రెయిన్ రిలాక్స్ కావడంలోనూ వర్కవుట్స్ యూజ్ అవుతాయి. యోగా వంటివి మన మెదడును 'తక్కువ పని' చేసేలా చేస్తాయి. ఇలాంటప్పుడు మెదడుకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అంతేకాదు.. వ్యాయామం చేసినప్పుడు.. మెదడు సెరోటోనిన్, ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.
మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్ అయిపోతుంది!
సరిగ్గా తినడం:మనం తీసుకునే ఆహారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి, అలాగే మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతో సహా చాలా మార్గాల్లో సహాయపడుతుంది. నిజానికి, సరైన పోషకాహారాన్ని తినడం వల్ల కూడా మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మనం ఆరోగ్యంగా తిన్నప్పుడు.. మానసిక సంతృప్తిని ఫీలవుతుంటాం. అది ఇందులో భాగమే!