తెలంగాణ

telangana

ETV Bharat / health

మూత్రం ఎక్కువగా వస్తుంటే షుగర్ వచ్చినట్లేనా? తరచూగా మూత్రవిసర్జనకు కారణాలేంటి? - REASONS FOR FREQUENT URINATION

-తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడంపై డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? -ఆ కారణాల వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు వెల్లడి

Reasons For Frequent Urination
Reasons For Frequent Urination (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 23, 2024, 1:41 PM IST

Reasons For Frequent Urination: మనలో చాలా మంది తరచుగా మూత్రానికి వెళ్తుంటారు. సాధారణంగా అయితే, వయసు పైబడిన వారు ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్తుంటారు. కానీ.. వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు భావించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూత్రానికి తరచుగా వెళ్తుంటే చాలా మంది డయాబెటిస్ బారిన పడ్డామని ఆందోళన చెందుతుంటారు. మరి మూత్రం ఎక్కువగా రావడానికి కారణాలేంటి? దీనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కారణంకావొచ్చు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ఫెక్షన్‌: మూత్రాశయంలో మంట (సిస్టిటిస్) వంటి సమస్యలు ఉన్నవారిలో మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కూడా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే మూత్రం ముదురు రంగులో వాసన వస్తుంటే ఇన్ఫెక్షన్‌లు ఉన్నట్లు భావించాలని సూచిస్తున్నారు. అయితే, ఇలాంటి లక్షణాలు కొంతమందిలో కొన్నిరోజుల తర్వాత తగ్గిపోతాయని వివరిస్తున్నారు. కానీ, దీర్ఘకాలికంగా మూత్రంలో మంట, అసౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అధిక రక్తపోటు: ఇంకా ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తుంటారని నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేసే అవకాశం ఎక్కువ అని 2016లో "హైపర్‌టెన్షన్"అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ ఎస్. రోజెన్ పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుదల :50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ప్రొస్టేట్‌ గ్రంథి పెరుగుదల చాలా సాధారణంగా కనిపిస్తుందని నిపుణలు చెబుతున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల చిన్నవయసులోనే కొంతమంది పురుషులలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు. ఈ ప్రోస్టేట్‌ గ్రంధి పెరుగుదల వల్ల కూడా ఈ సమస్య వస్తుందని పేర్కొన్నారు.

మహిళల్లో వచ్చే సమస్యలు: ముఖ్యంగా మహిళల్లో వయసు రీత్యా వచ్చే మార్పుల్లో మెనోపాజ్‌ దశ ఒకటి. ఈ సమయంలో రుతుక్రమం ఆగిపోయి.. మహిళలు తరచుగా మూత్రవిసర్జనగా వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోతాయని.. దీనివల్ల మూత్ర వ్యవస్థను ప్రభావితమై హార్మోన్లలో మార్పులు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇంకా మహిళల్లో ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు.. పెల్విక్‌ నొప్పి, రక్తస్రావం ఎక్కువగా కావడం వంటి వివిధ కారణాలు ఉంటాయని పేర్కొన్నారు.

పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌ సమస్యలు : వయసు పైబడుతున్నా కొద్ది మహిళలు, పురుషులలో శరీరంలోని పెల్విక్‌ ఫ్లోర్‌ మజల్స్‌ సాగుతుంటాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం.. కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే, మనలో చాలా మంది షుగర్ వల్లే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తామని భావిస్తుంటారు. కానీ, దీంతో పాటు వాతావరణంలో మార్పులు, మోతాదుకు మించి నీరు తాగినప్పుడు కూడా మూత్రం ఎక్కువగా వస్తుందని తెలిపారు. సాధారణంగా ఒక రోజు 2 - 2.5 లీటర్ల నీరు తీసుకుంటే పర్లేదని.. కానీ అంతకు మించి నీరు తాగితే మూత్రం ఎక్కువగా రావొచ్చని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిటికెడు ఇంగువ పోషకాలు మెండుగా- బీపీ, అజీర్తి, పీరియడ్స్ పెయిన్స్​కు చెక్!

ఆ ఫుడ్ తింటే పెద్దపేగు క్యాన్సర్‌ వస్తుందట జాగ్రత్త! ఈ డైట్ పాటిస్తే సేఫ్!

ABOUT THE AUTHOR

...view details