Carissa Carandas Health Benefits :వర్షాకాలంలో మెట్ట ప్రాంతాల్లో, తోటలు, చేను గట్లపై విరివిగా కాసే ఈ పండ్లు తెలియని వారుండరు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇవి అందరికీ సుపరిచితమే. వారాంతపు సంతల్లోనూ వీటిని కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. కొంత మందికి అవి ఏమిటో తెలియకున్నా రంగు, పరిమాణం చూసి ఆకర్షితులవుతుంటారు.
ఉత్తర తెలంగాణలో వాక్కాయ అని, దక్షిణ తెలంగాణలో కలింపండ్లు, కలేక్కాయ అని వీటికి పేర్లు. ఓ వైపు ఎరుపు, గులాబీ రంగు కలగలిపి, మరో వైపు ఆకుపచ్చ రంగుతో నోరూరించే ఈ పండ్లు రుచి విషయంలో కాస్త వగరు, ఎక్కువ పులుపు రుచిని కలిగి ఉంటాయి. ఈ పండ్లతో కూరలు, పచ్చళ్లతోపాటు రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటారు. ఆరోగ్య పరంగానూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
జామపండు Vs డ్రాగన్ ఫ్రూట్ - విటమిన్ పోటీలో విన్నర్ ఎవరంటే! - GUAVA VS DRAGON FRUIT
పాన్ షాపుల్లో స్వీట్ పాన్ టూత్పిక్కు ఎర్రని పండును గుచ్చి ఉండడం మనం చూసే ఉంటాం. తియ్యని రుచి కలిగిన ఆ పండ్లు చెర్రీస్ అని అనుకుంటారు చాలా మంది. కానీ అవి వాక్కాయలు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేయడంతో పాటు కేకులు, సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు. పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ పదార్థాలన్నింటినీ చేసేది సహజసిద్ధంగా దొరికే కలిమె పండ్లతోనే. ఈ కాయలను చింతపండుకు బదులుగా ఎక్కువగా వాడుతుంటారు. పప్పులో వేయడంతో పాటు రోటి పచ్చళ్లు తయారు చేసుకుంటారు. ఆవకాయ, పచ్చిమిర్చి కలిపి నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు.
కలిమె పండ్ల చెట్లకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎత్తుగా, పొదలా పెరుగుతాయి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్ సహా మన రాష్ట్రంలోని ఒంగోలు, రాయలసీమలో వీటిని చూడొచ్చు. ఆయా జిల్లాల్లో తోటల చుట్టూ వీటిని పెంచుకుని అటవీ జంతువులు రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు సీజన్‌లో వచ్చే ఈ పండ్లతో వివిధ రకాలైన పదార్థాలు తయారు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు.