Side Effects of Sleeping with Phone :చిన్నా పెద్దా తేడా లేకుండా.. పొద్దున లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ అందరూ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. చివరికి పడుకునేటప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకుండా తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోయేవారు చాలా మందే ఉన్నారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా? అయితే.. ఈ చిన్న తప్పుతో మీ చేతులా మీరే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీరు రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం చాలా అనారోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా.. నిద్రలో మొబైల్ పక్కనే ఉంచుకోవడం వల్ల పదే పదే వచ్చే నోటిఫికేషన్ల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందంటున్నారు. ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. సరైన నిద్రలేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
- తగినంత నిద్ర లేకపోతే నెక్ట్స్ డే సరిగ్గా పని చేయలేరు. రోజంతా ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. అంతేకాదు.. అది మన ఆలోచనా సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అలాగే.. మీలో మీరే పరధ్యానంగా మారతారు. ఇతరుల విషయాలు, సాధారణ విషయాలు కూడా సరిగా అర్థం కావని నిపుణులు సూచిస్తున్నారు.
- అలాగే, నిద్రించే ముందు మొబైల్ చూడడం వల్ల దాని నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది కూడా నిద్రలేమి సమస్యలకు దారితీయవచ్చంటున్నారు.
- 2016లో "Sleep" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రాత్రిపూట ఫోన్‌లను ఉపయోగించే వారిలో మెలటోనిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయని, ఇది నిద్ర సమస్యలకు దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన డాక్టర్ మారియా డి. డాన్స్ పాల్గొన్నారు. నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల దాని నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రలేమి, కంటి సమస్యలకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.
- అంతేకాదు.. ఫోన్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి వివిధ రకాల కంటి సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దృష్టి మసకబారడం, కంటి చూపు దెబ్బతినడం లాంటివి చోటుచేసుకోవచ్చంటున్నారు.
- అదేవిధంగా, సరైన నిద్ర లేక కంటి నరాలు ఇబ్బందికి గురికావొచ్చు. మెడ నొప్పులు, నడుము నొప్పుల వంటి సమస్యలు రావొచ్చంటున్నారు. కాబట్టి, రాత్రిపూట వీలైనంత వరకు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు.
రేడియేషన్‌తో పెద్ద ప్రమాదం : ఇవేకాదు.. ముఖ్యంగా తల పక్కన ఫోన్ పెట్టుకుని నిద్రించడం వల్ల రాత్రంతా దాని నుంచి రేడియేషన్ విడుదలవుతూ ఉంటుంది. ఆ రేడియేషన్‌లోనే మనం రాత్రంతా గడపడం వల్ల తల నొప్పులు, కండరాల నొప్పుల్లాంటివే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తడానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు. అలాగే.. ఈ రేడియేషన్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా పేర్కొంటోంది.