తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ కూరలో ఉప్పు ఎక్కువైందా? ఈ ఈజీ టిప్స్​తో అంతా సెట్!

How To Reduce Excess Salt In Curry : మీరు ఎంతో ఇష్టంగా వండిన కూరలో ఉప్పు ఎక్కువయిందా? ఏవిధంగా తగ్గించాలని ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. మీ వంటింట్లో లభించే ఏయే పదార్థాలు కూరలో ఉప్పును తగ్గించేందుకు ఉపయోగపడతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

How To Reduce Excess Salt In Curry
How To Reduce Excess Salt In Curry

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 6:43 AM IST

How To Reduce Excess Salt In Curry : ఆరు రుచులలో ఉప్పు ఒకటి అంటారు. కానీ నిజానికి ఉప్పు లేనిదే ఏదీ రుచిగా ఉండదు. అది మాంసాహారం కావచ్చు శాఖాహారం కావచ్చు. ఉప్పు లేనిదే ఏ వంటకానికీ మోక్షం కలగదు అంటే అతిశయోక్తి కాదు. వంటల్లో ఉప్పునకు అంత ప్రాధాన్యం ఉంది. అయితే కొన్నిసార్లు ఏదో బీజీలో ఉండి కూరల్లో ఉప్పును ఎక్కువగా వేసేస్తుంటారు కొంతమంది. ఫలితంగా ఆ వంటకం అంతగా రుచించదు. అలాంటి సందర్భాల్లో వంట చేసేంత సమయం కూడా ఉండదు. మరి అలాంటప్పుడు మీరు వండిన వంటకంలో ఉప్పును తగ్గించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మన వంటింట్లో ఏ పదార్థాలు కూరలో ఉప్పును తగ్గిస్తాయి అనే విషయాలు మీ కోసం.

  1. బంగాళాదుంపలు :ఒకవేళ మీ కూరలో ఉప్పు ఎక్కువగా వేసి ఉంటే వెంటనే మీ వంట గదిలో ఉన్న బంగాళాదుంపలను తీసుకొండి. దాన్ని ముక్కలుగా చేసి మీరు వండిన లేదా వండుతున్న కూరలో వేసి ఒక 15నుంచి 20నిమిషాల పాటు ఉడకనివ్వండి. తరువాత మీ కూరలోంచి ఆలూ ముక్కలను బయటకు తీసేయండి. అంతే, మీ కూరలో ఎక్కువైన ఉప్పు ఇట్టే తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ కూరలోని గ్రేవీని కూడా బంగాళాదుంపలు పీల్చేసుకుంటాయి. కనుక బంగాళాదుంపలు వేసినప్పుడే మీరు గ్రేవీ కోసం కొంచం నీరు పోసుకుంటే మంచిది.
  2. పెరుగు :మీ వంట గదిలో ఎప్పుడూ ఉండే పెరుగు కూడా కూరలో ఉప్పు తగ్గించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి దాంట్లో కొంచెం నీళ్లు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ కూరలో వేసి మూత పెట్టి, వేడెక్కేవరకూ ఉంచండి. మీరు వేసిన పెరుగు పూర్తిగా మీ కూరలో కలిసిపోయేదాకా ఉంటే చాలు. మీ కూరలో ఉప్పు తగ్గిపోయినట్టే. మీ సమస్య తీరినట్టే.
  3. నిమ్మరసం :కూరలో ఉప్పు తగ్గించేందుకు సమయానికి మీ వంటింట్లో పెరుగు, బంగాళాదుంపలు లేకపోతే మీకు నిమ్మకాయ కచ్చితంగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ రసం తీసుకుని మీరు వండుతున్న కూరలో వేసి బాగా కలపండి. నిమ్మకాయ కలిపిన వెంటనే స్టవ్ ఆపేసి మూతపెట్టేయండి. అంతే మీ కూరలో ఉప్పు తగ్గి రుచిగా మారుతుంది. జాగ్రత్త! నిమ్మకాయ రసం వేసిన తరువాత కూరను వేడి చేస్తే మీరు వండిన పదార్థం చేదుగామారే ప్రమాదం ఉంది.
  4. శనగపిండి :కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు మీ వంటింట్లో ఉండే శనగపిండి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండిని తీసుకుని, స్టవ్ వెలిగించండి. మీరు తీసుకున్న శనగపిండి రంగు మారి మంచి వాసన వచ్చే వరకూ బాగా వేయించండి. ఇప్పుడు ఈ పిండిని కూరలో వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పు తగ్గడమే కాక మంచి సువాసన వస్తుంది.
  5. కూరగాయలు :చివరి చిట్కా ఏంటంటే మీరు వండిన కూరలో ఉప్పు ఎక్కువ పడిందని మీకు తెలియగానే మీరు ఏ కూరగాయలతో వంట చేస్తున్నారో వాటిని తీసుకుని మళ్లీ వేరుగా ఉప్పు వేయకుండా వండి దాన్ని మీరు మొదట చేసిన కూరలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల మీ కూర మోతాదు పెరుగుతుంది. అలాగే ఇక్కడ మీ సమయం కూడా వృథా అవుతుంది అన్నది మాత్రం వాస్తవం.

ABOUT THE AUTHOR

...view details