What Food Boosts Vitamin D:మనం ఆరోగ్యంగా ఉండడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం కీలకమని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్ డి పాత్ర ఎంత ప్రధానమని వివరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఏయే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అందుకే అవి తీసుకోవాలి!
ఎముకల్ని దృఢంగా ఉంచడంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ విటమిన్ తగినంత తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్లకు కూడా దూరంగా ఉండచ్చని వివరిస్తున్నారు. ఈ విటమిన్ లోపిస్తే కండరాల బలహీనత, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆందోళన, ఒత్తిడి, అలసట, జుట్టు రాలడం, దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 2019లో The Lancet Diabetes & Endocrinology జర్నల్లో ప్రచురితమైన "Vitamin D and Health" అనే అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలోనే డి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు లేదంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే సహజంగానే పెంచుకోవచ్చని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పాలు, పెరుగు:ఆవు పాలలో విటమిన్ డి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవు పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా ఈ విటమిన్‌ను శరీరానికి అందించచ్చని వివరిస్తున్నారు. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరమని అంటున్నారు. పెరుగులో కూడా ప్రొటీన్లతో పాటు డి విటమిన్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే బయట దొరికే పెరుగులో చాలావరకు ఫ్లేవర్స్ కలుపుతుంటారు కాబట్టి అందులో చక్కెర స్థాయులు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే ఇంట్లోనే పెరుగు తోడేసుకొని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పుట్టగొడుగులు:ఎండలోనే పెరిగే పుట్టగొడుగుల్లో విటమిన్ డి స్థాయులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బి1, బి2, బి5, కాపర్ వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు. అయితే పుట్టగొడుగుల్లోనూ బటన్ మష్రూమ్స్, స్ట్రా మష్రూమ్స్ ఇలా వివిధ రకాలుంటాయని.. వాటిని బట్టి విటమిన్ డి స్థాయులు మారుతూ ఉంటాయని అంటున్నారు.