Is Cinnamon Control Sugar Level:ప్రస్తుతం షుగర్ బాధితులు ఎక్కువయ్యారు. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయ్యిందా.. జీవితాంతం మందులు వాడాల్సిందే. తినే తిండిని కూడా తగ్గించుకోవాలి. ఏది తినాలన్నా డాక్టర్లను ఒకటికి రెండు సార్లు సంప్రదించాలి. అయితే మధుమేహులు దాల్చిన చెక్కను వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.డయాబెటిస్ ఉన్న వారు దాల్చిన చెక్క వినియోగించడం వల్ల వారి బ్లడ్ షుగర్ లెవల్ తగ్గుతుందని అంటున్నారు. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు సైతం వెల్లడించినట్లు వివరిస్తున్నారు. అసలు దాల్చిన చెక్కకు, షుగర్‌కు ఉన్న సంబంధం ఏంటి? దాల్చిన చెక్క వల్ల షుగర్ నిజంగానే అదుపులో ఉంటుందా? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మన వంటింట్లో దాల్చిన చెక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కను ఔషధంగా వాడతారు. అయితే షుగర్‌తో బాధపడుతున్నవారు దాల్చిన చెక్క ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని.. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే దాల్చిన చెక్కలో ఉండే సహజ ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుందని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత చెబుతున్నారు.
"దాల్చిన చెక్కలో ఫ్లేవనాయిడ్స్ లాంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లేమరీ, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువ ఉత్పత్తి అవ్వకుండా.. వాటి స్థాయులను అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుంది. సోడియంను శరీరంలో నుంచి బయటకు పంపడంలో కృషి చేస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, వాపులకు దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను 1/4 టీ స్పూన్ ప్రతిరోజూ తీసుకుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తున్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది."
--డాక్టర్ శ్రీలత, డైటీషియన్
ఇలా తీసుకుంటే మంచిది: దాల్చిన చెక్కను పొడి లాగా చేసుకుని 1/4 టీ స్పూన్ చొప్పును నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువ మోతాదులో నిల్వ ఉండేలా చేస్తుందన్నారు. డయాబెటిస్ ఉన్న వారు ఉదయం, సాయంత్రం కచ్చితంగా నీటిలో కలిపి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని పలు పరిశోధనల్లో తేలినట్లు వివరిస్తున్నారు.