Warning Signs Of High Blood Pressure :అధిక మూత్ర విసర్జన అనేది అంత ఈజీగా తీసిపారేసే విషయం కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. ఇది ఏదైనా ఆరోగ్య సమస్య లక్షణం కావొచ్చు. ముఖ్యంగా కొందరికి రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. అయితే, చాలా మంది దీనిని డయాబెటిస్ లక్షణంగా భావిస్తుంటారు. కానీ, అది షుగర్ లక్షణం మాత్రమే కాదని.. మరో ప్రమాదకర ఆరోగ్య సమస్య హెచ్చరికా సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెజార్టీ పీపుల్ రాత్రిపూట అధికంగా మూత్ర విసర్జన చేయడాన్ని.. మధుమేహం సంకేతంగా భావిస్తుంటారు. కానీ, అది డయాబెటిస్ మాత్రమే కాదని.. 'అధిక రక్తపోటు'(High Blood Pressure) వల్ల కూడా నైట్ టైమ్ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. రక్తపోటు స్థాయిలలో అసమతుల్యత ఉన్నప్పుడు కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఆ కారణంగా మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? - ఈ ఆహారాలు ఔషధం!
కాబట్టి.. మీలో ఇలాంటి లక్షణం కనిపిస్తే డయాబెటిస్ పరీక్షతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ఒకవేళ మీకు హైబీపీ ఉంటే త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. లేదంటే.. హై-బీపీ కారణంగా ధమనులు దెబ్బతింటాయి. ఫలితంగా గుండెపోటు లేదా స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. అంతేకాదు.. అధిక రక్తపోటు సమస్యను అదుపు చేయకుండా వదిలేస్తే, గుండె సమస్యలే కాకుండా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుందని.. దృష్టి కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం కూడా జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే.. అధిక రక్తపోటు సమస్యను త్వరగా గుర్తించి అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.