తెలంగాణ

telangana

ETV Bharat / health

డెలివరీ తర్వాత "బెల్టు" వాడితే పొట్ట తగ్గుతుందా? - వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?

-ప్రసవం తర్వాత పొట్ట పెరగడానికి కారణాలు ఎన్నో -బెల్టు వాడటం కాకుండా బెల్లీ ఫ్యాట్​ తగ్గాలంటే ఇవి చేయాలట!

By ETV Bharat Health Team

Published : 4 hours ago

DOES BELTS REDUCE BELLY FAT
HOW TO REDUCE POST PREGNANCY BELLY (ETV Bharat)

Abdominal Belts Can Reduce Bellyfat?:నవమాసాలూ గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే, డెలివరీ తర్వాత పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ.. చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. దీంతో అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఈ క్రమంలోనే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే.. కొందరు మహిళలు బెల్లీని తగ్గించడానికి "అబ్డామినల్ బెల్టులు" వాడుతుంటారు. ఇంతకీ.. నిజంగానే డెలివరీ తర్వాత బెల్టు వాడితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్​.. ఏదైనా సరే డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు. అయితే, ప్రసవం తర్వాత పొట్ట పెద్దగా కనపడటానికి చాలా కారణాలుంటాయంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వై. సవితాదేవి. అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే.. కాన్పు తర్వాత పొట్ట ఎత్తుగా కనిపిస్తోందంటే కండరాలు గర్భధారణ సమయంలో మరీ ఎక్కువగా సాగి డెలివరీ అయ్యాక నార్మల్ స్థితికి రాకుండా ఇంకా వదులుగానే ఉండటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

అలాగే.. బరువు పెరగడం వల్ల పొట్టలో కొవ్వుపేరుకుపోతుంది. దీన్ని మరో కారణంగా భావించొచ్చు. అదేవిధంగా.. గర్భిణిగా ఉన్న టైమ్​లో కండరాలు పక్కకు తొలగిపోవడం ఇంకో కారణం. చివరగా డెలివరీ సిజేరియన్‌ ద్వారా జరిగి ఉంటే.. అక్కడ కణజాల పొరల్లో ఖాళీ ఏర్పడి, కుట్లు సరిగ్గా అతుక్కోక ఆ సందుల్లో నుంచి పొట్ట లోపలి అవయవాలు బయటకు ఉబ్బెత్తుగా రావడం జరగొచ్చంటున్నారు డాక్టర్ సవితాదేవి. దీన్ని ఇన్‌సెషనల్‌ హెర్నియాగా పిలుస్తారు. అయితే.. అత్యంత సాధారణ కారణమైతే కండరాల బలహీనతే అని చెబుతున్నారు.

కారణం ఏదేమైనప్పటికీ.. డెలివరీ తర్వాత వచ్చిన పొట్టను తగ్గించుకోవడానికి బెల్టు వాడుతున్నట్లయితే.. అది పెట్టుకున్నంత వరకు పొట్ట కండరాలకు ఆసరాగా, మీకు సౌకర్యంగా ఉంటుంది. కానీ.. అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదని సూచిస్తున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి. నిజానికి బెల్టు వల్ల పొట్ట తగ్గదని.. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామంతప్పనిసరి అని చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట, నడుము దగ్గర ఉండే కోర్‌ కండరాలు దృఢంగా మారాలంటే.. క్రంచెస్‌, స్ట్రెయిట్‌ లెగ్‌ రైజింగ్‌, ప్లాంక్స్‌ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలంటున్నారు. అలా చేయడం ద్వారా కండరాలకు మంచి వ్యాయామం లభించి పొట్ట తగ్గడానికి సహాయపడుతుందంటున్నారు.

అదేవిధంగా.. లైపో సెక్షన్‌ ప్రక్రియ ద్వారా అదనపు కొవ్వును తొలగించుకోవచ్చంటున్నారు. అదే.. హెర్నియా ఉన్న వారికి శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతున్నారు. అయితే.. ఇక సంతానం అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలాంటి సర్జరీలు చేయించుకుంటే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

ప్రెగ్నెన్సీ తర్వాత నడుం నొప్పి వేధిస్తోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక!

ABOUT THE AUTHOR

...view details