తెలంగాణ

telangana

ETV Bharat / health

మాంసాహారం తినకున్నా కొలెస్ట్రాల్? - ఆహారంలో ఈ మార్పులు సూచిస్తున్న నిపుణులు

హై కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం - ఈ డైట్​ ఫాలో అయితే ఈజీగా తగ్గించుకోవచ్చట!

DIET CHART FOR HIGH CHOLESTEROL
Cholestrol Reduce Foods (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 2:29 PM IST

Updated : Dec 2, 2024, 6:52 AM IST

Cholesterol Reduce Foods : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు. కానీ, కొందరిలో నాన్​వెజ్ తినకపోయినా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతుంటాయి. అయితే, శాఖాహారుల్లోనూ హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పోషకాహార నిపుణులు సూచిస్తున్న డైట్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడానికి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ఒక్కటే కారణం కాదంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. జన్యువులు, శరీరతత్త్వం, జీవనశైలి వంటివి ఎక్కువగానే ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. అలాంటి టైమ్​లో వాటిని సమతుల్యం చేసుకుంటూ ఆహార నియంత్రణ పాటిస్తే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు. అందుకోసం డైలీ డైట్​లో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.

వీటిని పరిమితికి మించకుండా చూసుకోవాలి :మనం రోజు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు తగిన మొత్తంలో ఉండాల్సిందే. ఇవన్నీ శక్తి జనకాలు. కానీ, వీటిని రోజువారీ శరీర అవసరాలకు మించి.. ఏ రూపంలో తీసుకున్నా కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. నూనెలు ఎక్కువగా ఉండే డీప్‌ఫ్రైలు, చిరుతిళ్లు, పనీర్, గుడ్లు, పిండిపదార్థాలు, చికెన్, పచ్చళ్లు, త్వరగా జీర్ణమయ్యే ప్రాసెస్డ్‌ ఫుడ్, స్వీట్లు, పళ్ల రసాలు వంటివన్నీ ఇందులోకి వస్తాయి. కాబట్టి, కొలెస్ట్రాల్​ని తగ్గించుకోవాలంటే మీ ఆహారంలో వీటిని పరిమితికి మించకుండా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు.

కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు వాడుతున్నారా? - నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

అన్నింటికంటే మందుగా.. మీ బాడీ వెయిట్, ఎత్తు ఎంత, మనం చేసే పనులకు ఎంత శక్తి అవసరం, అందుకు ఏయే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి? వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని నిపుణులు సూచించే బ్యాలెన్స్డ్ డైట్​ని ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ. అందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను మీ రోజువారి ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోవాలి.

ఇవి తప్పక తీసుకోవాలి! :కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీ డైలీ డైట్​లో పీచు ఎక్కువగా, ఆయిల్ తక్కువగా ఉండే పదార్థాలు, నెమ్మదిగా జీర్ణమయ్యే ఓట్స్‌ బార్లీ, మొక్కజొన్న, చిరుధాన్యాలు చేర్చుకోవాలి. అలాగే కూరగాయలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డ్రైఫ్రూట్స్‌కి బదులు చియా, అవిసె గింజలువంటి వాటిని తీసుకోవాలి. ఆహారపుటలవాట్లలో ఈ మార్పులు చేసుకోవడంతో పాటు తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అలాగే, ఎత్తుకు తగ్గ బరువున్నారో లేదో చెక్ చేసుకుని అందులో కనీసం పదిశాతమైనా తగ్గేలా ఏరోబిక్స్, డ్యాన్స్‌ వంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చంటున్నారు న్యూట్రిషనిష్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

హై-కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - బార్లీని ఇలా తీసుకుంటే మంచి ఫలితం అంటున్న నిపుణులు!

Last Updated : Dec 2, 2024, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details