Can Pillows Cause Asthma :సూపర్ బెడ్.. దానిపైన చక్కటి పరుపు.. దాని మీద మంచి బెడ్ షీట్ .. పడుకోవడానికి ఇవి చాలా అని ఎవరినైనా అడగండి! ఒక్క దిండు ప్లీజ్ అంటారు. "ఎంత అద్భుతమైన బెడ్ మీదనైనా సరే.. నెత్తి కింద పిల్లో లేకపోతే మాకు నిద్ర పట్టదు" అంటుంటారు చాలా మంది. మీకూ అలాంటి అలవాటు ఉందా? అయితే.. అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీని వల్ల ఆస్తమా ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నిజానికి దిండు వాడడం వల్ల మెడ నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. దీర్ఘకాలంలో పలు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ చాలా కాలంగా అలవాటైందని చెబుతూ ఎక్కువ మంది వాటిని కొనసాగిస్తుంటారు. అయితే కేవలం దిండు మాత్రమే కాదు, వాటి వినియోగం సరిగా లేకపోయినా కూడా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఏళ్ల తరబడి వాడేస్తుంటారు
కొంతమంది ఒక్కసారి తలగడ కొనుగోలు చేస్తే దాన్ని ఏళ్ల తరబడి వాడుతూనే ఉంటారు. అంతేకాదు దిండ్లను క్లీన్ చేయడం కూడా మరిచిపోతుంటారు. మీరూ ఇలానే చేస్తూ ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. అలాగే దీర్ఘకాలం దిండ్లను వినియోగించకూడదని చెబుతున్నారు. లాంగ్ టైమ్లో తలగడపై దుమ్ము, ఇతర అలర్జీ కారకాలు భారీగా పేరుకుపోతాయంటున్నారు. ఇవి బ్యాక్టీరియా పెరగడానికీ దారి తీస్తాయని చెబుతున్నారు. ఇది జరిగినప్పుడు వృద్ధులు, చిన్న పిల్లలు ఆస్తమాబారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అలర్ట్ : మీ అందాన్ని పాడుచేసే మొటిమలకు - మీ దిండు కారణమని తెలుసా?
"సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" చేసిన ఓ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది. దీర్ఘకాలంలో దిండుపై దుమ్ము, ఇతర అలర్జీ కారకాలు పేరుకుని బ్యాక్టీరియా వృద్ధికి దారి తీస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఆస్తమా బారినపడతారట. అంతేకాదు ఎక్కువ కాలం ఒకే తలగడను వాడటం వల్ల దాని ఆకృతి దెబ్బ తిని మెడ, తలనొప్పివంటి సమస్యలువస్తాయని కనుగొన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి! :
- ఏదేమైనప్పటికీ నిద్రించడానికి తలకింద వేసుకునే దిండును రెండు మూడేళ్లకోసారైనా మార్చడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే తరచూ ఎండలో పెట్టడం, ఎప్పటికప్పుడు దుమ్ము దులపడం, కొత్త కవర్లు తొడగడం వంటివీ చేయాలని చెబుతున్నారు.
- కేవలం దిండు విషయంలో మాత్రమే కాదు, వాటికి తొడిగే పిల్లో కవర్ల శుభ్రత విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ రోజులు వాష్ చేయకుండా ఉండొద్దని, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీలైతే ఆరు నెలలకు ఒకసారి కొత్త దిండు కవర్‌ను మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సూపర్ ఐడియా: దిండ్లపై మరకలు పోవడం లేదా ? ఈ టిప్స్ పాటిస్తే చిటికెలో మాయం!