తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా! - Hypothyroidism Affects on Pregnancy - HYPOTHYROIDISM AFFECTS ON PREGNANCY

Can Hypothyroidism Affect on Pregnancy ? : మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ఆరోగ్యసమస్యలు తెలియకుండానే మనల్ని చుట్టుముడతాయి. వాటి వల్ల హెల్త్​కి జరగకూడని నష్టం జరిగేదాకా గుర్తించలేం. అలాంటి వాటిల్లో ఒకటి.. థైరాయిడ్‌! ఈరోజుల్లో చాలా మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనిషిని ఎన్నో విధాలుగా ఇబ్బందిపెట్టే హైపోథైరాయిడిజం వల్ల సంతానం సాధ్యం అవుతుందా? కాదా??

Can Hypothyroidism Cause Infertility
HYPOTHYROIDISM AFFECTS ON PREGNANCY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 11:34 AM IST

Can Hypothyroidism Cause Infertility? :మన శరీరంలో వివిధ జీవక్రియలను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. పొరపాటున దాని పనితీరులో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే ఈ గ్రంథి పనితీరు వేగం మితిమీరుతుంది. దీన్నే 'హైపర్‌ థైరాయిడిజం'గా పిలుస్తారు. అదే నెమ్మదిస్తే'హైపో థైరాయిడిజం' సమస్యగా భావిస్తారు. అయితే.. హైపోథైరాయిడిజం సంతాన సమస్యలకు కారణం అవుతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. మరి.. ఇది ఎంతవరకు నిజం? దీనిపై వైద్యులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'థైరాయిడ్ ఉన్నవారు గర్భం ధరించలేరా?' అంటే.. భిన్న ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. థైరాయిడ్ సమస్యను గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే దీని ప్రభావం ప్రెగ్నెన్సీ మీద ఉండదని చెబుతున్నారు. కానీ.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఓ విషయం ఉందని అంటున్నారు. T4 (థైరాక్సిన్‌) హార్మోన్‌ స్థాయులు తగ్గిపోవడం వల్ల ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ (పిట్యుటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్‌) స్థాయులు పెరిగిపోతాయి. ఇలా జరిగినప్పుడు అండం సరైన సమయంలో విడుదల కాదు. కాబట్టి గర్భం ధరించడం కష్టమవుతుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మొవ్వ మాధురి చెబుతున్నారు. 'హైపోథైరాయిడిజం సమస్య' నెలసరిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు. ఇది కూడా సంతానలేమికి దారితీస్తుందని సూచిస్తున్నారు.

థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్​తో అదుపులోకి రావడం పక్కా!

కాబట్టి.. హైపోథైరాయిడిజం ఉన్న వారు ట్యాబ్లెట్స్ డోసు సరిపోయిందా? లేదా? తెలుసుకోవాలంటే.. గర్భం ధరించే ముందు ఒకసారి థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. టీఎస్‌హెచ్‌ 2.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే గర్భం ధరించడానికి థైరాయిడ్‌ వల్ల సమస్య ఉండదని డాక్టర్ మాధురి చెబుతున్నారు. అందుకే.. ఈ సమస్యను త్వరగా గుర్తించి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే సంతాన భాగ్యానికి నోచుకోవచ్చంటున్నారు. అలాగే గర్భం ధరించిన తర్వాత కూడా డాక్టర్ల సలహా తీసుకొని చికిత్స/మందులను కొనసాగించొచ్చని చెబుతున్నారు. మెడిసిన్ తీసుకుంటూ సరైన పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

2002లో 'Journal of Clinical Endocrinology & Metabolism' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. TSH స్థాయిలు 2.5 mIU/L కంటే ఎక్కువగా ఉన్న మహిళలకు గర్భం ధరించడానికి 2 రెట్లు ఎక్కువ సమయం పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

థైరాయిడ్​తో సెక్స్ కోరికలు తగ్గిపోతాయా?

ABOUT THE AUTHOR

...view details