Best Tips to Relief Bloating in Telugu :కడుపు ఉబ్బరం.. చాలా మంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. మనం ఆహారం మింగుతున్న సమయంలో గాలి జీర్ణ వ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళుతూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద పేగులు, జీర్ణాశయంలో చిక్కుకుపోయి ఉంటే పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా అనిపిస్తోంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే.. దీర్ఘకాలంలో మలబద్ధకం, హైపర్ ఎసిడిటీతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. మీరూ తరచూ కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా? అయితే.. మీ ఆహార నియమాలు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈజీగా ఆ సమస్యను అధిగమించవచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కడుపు ఉబ్బరం రావడానికి.. ఒత్తిడి, ఆందోళన, పొగతాగటం, జీర్ణకోశంలో ఇన్పెక్షన్, చిన్నపేగులలో బ్యాక్టీరియా పెరుగుదల, పొత్తికడుపులో గ్యాస్ పేరుకుపోవడం, ఇర్రిటెబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటివి కారణమవుతాయంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ డాక్టర్ యార్లగడ్డ నాగార్జున. అంతేకాదు.. కడుపు ఉబ్బరం అనేది ఒక రకమైన పోషకాహార సమస్య అనీ చెప్పుకోవచ్చంటున్నారు. కాబట్టి.. మీ ఆహారపు అలవాట్లలో ఈ మార్పులు చేసుకుంటే ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు.
ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి!
- కడుపు ఉబ్బరం సమస్య తగ్గాలంటే ముందుగా మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు డాక్టర్ నాగార్జున.
- అన్నింటికంటే ముఖ్యంగా.. మీరు ఏది తింటే ఉబ్బరం సమస్య ఎక్కువవుతుందో దాన్ని గుర్తించి వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాలి.
- వాటిలో ప్రధానంగా ఉబ్బరాన్ని ప్రేరేపించే.. సోడా, బీర్ వంటి కార్బోనేటేడ్ పానీయాలు, ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, బీన్స్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే యాపిల్స్, ఆప్రికాట్స్, అరటిపండ్లు, పీచెస్, బేర్రీలు వంటి పండ్లు, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు.
- అలాగే.. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాలు, నూనెల్లో అతిగా వేయించిన ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, లావుగా ఉన్న పెద్ద ముక్కలను తినకూడదని సలహా ఇస్తున్నారు. అలాకాకుండా.. త్వరగా జీర్ణమయ్యే, అన్ని రకాల పోషకాలు లభించే ఆహారాలు తినాలని సూచిస్తున్నారు.
- అదేవిధంగా.. పొట్టులేని చిరుధాన్యాలు తినడం ద్వారా కూడా కడుపుబ్బరం సమస్య నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు.
తినే విషయంలో పాటించాల్సినవి :
- ఎప్పుడూ ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా.. కొద్దికొద్దిగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. అలాగే.. నెమ్మదిగా ఎక్కువసార్లు నమిలి తినడం ద్వారా కడుపు ఉబ్బర సమస్యను తగ్గించుకోవచ్చని Harvard Medical School బృందం తెలిపింది.(Harvard Health Publishing రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
- అదేవిధంగా.. ఆహారం తీసుకునే సమయంలో ఎక్కువ గాలి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం ద్వారా చాలా వరకు గ్యాస్ సమస్యను అధిగమించవచ్చంటున్నారు డాక్టర్ నాగార్జున.
- స్క్రీన్-ఫ్రీ జోన్‌లో తినేలా చూసుకోవాలి. అంటే.. తినేటప్పుడు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ లేదా టీవీ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- ఆహారపు అలవాట్లతో పాటు మీ డైలీ లైఫ్లో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. 2023లో "జర్నల్ ఆఫ్ రిహాబిలిటేషన్ మెడిసిన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వ్యాయామం(వాకింగ్, రన్నింగ్, బైకింగ్, స్విమ్మింగ్ లేదా యోగా చేయడం వంటివి) ఉబ్బరంతో కూడిన ఇర్రిటెబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడతాయని కనుగొన్నారు. ఇది ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందడానికి సహాయపడుతుందని తేల్చారు.
- అలాగే, 2021లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం.. తిన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నడిచిన వ్యక్తులలో ఉబ్బరం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.