Ayurvedic Remedy for Diarrhea:బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఇతర కారణాల వల్ల చాలా మందికి విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య కారణంగా శరీరంలోని నీరు, లవణాలు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అయితే, ఇలాంటి సమయంలో ఈ పానీయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. అలాగే.. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. పైగా దీన్ని ఇంట్లోనే అతి తక్కువ పదార్థాలతో ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చంటున్నారు. మరి.. ఏంటి ఆ హోమ్ రెమిడీ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
- వరిపేలాలు-కప్పు
- మానిపసుపు చూర్ణం -పావు టీస్పూన్
- చందనం చూర్ణం-పావు టీస్పూన్
- వట్టివేర్ల చూర్ణం-పావు టీస్పూన్
- చక్కెర-2 టేబుల్స్పూన్లు
పానీయం తయారీ విధానం..
- ముందుగా వరిపేలాలను మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
- తర్వాత ఒక గ్లాసు నీటిలో వరిపేలాల పిండి నాలుగు టేబుల్స్పూన్లు, మానిపసుపు వేసి కలుపుకోవాలి.
- తర్వాత వట్టివేర్ల చూర్ణం, చందనం చూర్ణం, చక్కెర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే విరేచనాలను తగ్గించే పథ్యాహారం తయారైపోయినట్లే..!
ఔషధ గుణాలు :
వరిపేలాలు :వరిపేలాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. వీటికి విరేచనాలను తగ్గించే లక్షణం ఉంటుంది.
మానిపసుపు : మానిపసుపు విరేచనాలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
వట్టివేర్లు :వట్టివేర్లు చలవ చేసే ఒక చక్కని మూలిక. చలవ చేయడం వల్ల విరేచనాల సమస్య తగ్గుతుంది. అలాగే వీటికి కాస్త చేదు, వగరు రుచి ఉంటుంది.