After Delivery Food For Mother : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అయితే బిడ్డకు జన్మనిచ్చిన దగ్గర నుంచి తల్లులు అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లికి ఏ చిన్న అసౌకర్యం ఉన్నా అది పిల్లలపై ప్రభావితం చేస్తుంది. అందుకే బాలింతల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బాలింతలు సరైన ఆహారం తీసుకుంటేనే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రసవం అనంతరం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.
ప్రసవం తర్వాత వెంటనే చేయాల్సినవి
బిడ్డను ప్రసవించిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే తల్లి డీహైడ్రేట్ అవ్వకుండా వైద్యుల సలహాతో ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ లాంటివి ఇవ్వాలి. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఏ పద్ధతిని అవలంబించింజమనేది ముఖ్యం. సాధారణ ప్రసవం జరిగిందా, ఫోర్ సెప్స్ లేదా సిజేరియన్ జరిగిందా అనే వాటి ప్రకారం తల్లికి ఆహారం ఎప్పుడు ఇవ్వాలనేది తెలుస్తుంది. సాధారణ ప్రసవం తర్వాత చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఫోర్ సెప్స్లో మాత్రం కాస్త ఇబ్బంది ఉంటే, సిజేరియన్ జరిగితే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ప్రసవం సమయంలో ఎక్కువ రక్తం పోవటం వల్ల నీరసంగా అయిపోతారు. అందుకే వెంటనే ఫ్లూయిడ్స్ ఇవ్వడం అవసరం. అలాగే సిజేరియన్ తర్వాత ఎక్కువ నొప్పి కలుగుతుంది. అందుకే వైద్యులు పెయిన్ కిల్లర్ లేదా ఆ తరహా ఇంజెక్షన్లు ఇస్తుంటారు.
ఆహారం విషయంలో జాగ్రత్త
ప్రసవం తర్వాత తల్లి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. బిడ్డకు తల్లి పాలిస్తుంది. అందుకే ఆహారం విషయంలో నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని వైద్యులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో నాలుగింట మూడు వంతులు చపాతీ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలని, అలానే ఒక వంతు పండ్లు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇలా పండ్లు, కూరగాయల వల్ల శరీరానికి ఎక్కువ మోతాదులో విటమిన్ ఎ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.