Suriya Kanguva Movie : 'కంగువా' చిత్రాన్ని నిర్మించడానికి దర్శక దిగ్గజం రాజమౌళి స్ఫూర్తిగా నిలిచారని ప్రముఖ తమిళ నటుడు సూర్య అన్నారు. రాజమౌళి చూపించిన దారిలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు రెండేళ్లపాటు శ్రమించి 'కంగువా'ను తీర్చిదిద్దినట్లు సూర్య తెలిపారు. స్టూడియో గ్రీన్ పతాకంపై శివ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన దర్శకుడు శివ, హీరో సూర్య కొండాపూర్ ఏఎంబీ మాల్లో ప్రేక్షకులను కలుసుకొని తమ చిత్ర విశేషాలను పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూసి వేదికపై ఒకింత భావోద్వేగానికి గురైన సూర్య, ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతోపాటు సమాజానికి మంచి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
"డైరెక్టర్ శివ ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను ఆయన్ను లేచి గట్టిగా హత్తుకున్నా. ఇలాంటి భారీ కథలు చేయాల్సి వచ్చినప్పుడు మొదట నాకు ఎంతో భయమేస్తుంది. కానీ 27ఏళ్ల అనుభవం ఉన్న నేను వెనకడుగు వేస్తే దానికి అర్థం ఉండదు. డబ్బు కోణంలో ఆలోచించకుండా, తపనతో చేయాల్సిన సినిమాలు ఇవి. 'బాహుబలి', 'కాంతార', 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి సినిమాలు ఇలా ఆలోచించి అడుగు వేసినప్పుడే సాధ్యమవుతాయి. హాలీవుడ్ నుంచి 'బ్రేవ్ హార్ట్', '300' లాంటి సినిమాలు చూసినప్పుడు మనమెప్పుడు చేస్తాం అని అనుకునేవాళ్లం. కానీ అలాంటి సినిమాలకి గేట్లు ఓపెన్ చేసిన డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు. ప్రాంతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చని ఆయన దారి చూపించారు. నవంబరు 14న మీకు ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని పంచుతుంది ఈ చిత్రం. ఈ స్టోరీ ఓ ఫైటర్ గురించి కాదు, వారియర్ గురించి" అని సూర్య అన్నారు.