Rajinikanth Lal Salaam :సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త సినిమా 'లాల్ సలామ్'. ఈ చిత్రంతో మొయిద్దీన్ భాయ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో(ఫిబ్రవరి 9) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కుమార్తె ఐశ్వర్య(Aishwarya Rajinikanth) డైరెక్ట్ ఈ చిత్రాన్ని తాను నిర్మించకపోవడానికి గల కారణాన్ని తెలిపారు.
"ఐశ్వర్య టాలెంట్ గురించి నాకు తెలుసు. అందుకే ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకున్నందుకు నేనేమి ఆశ్చర్యపోలేదు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దగ్గరికి వెళ్లకముందు ఐశ్వర్య కొంత మంది ప్రొడ్యూసర్స్‌ను కలిసింది. సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు తిరస్కరించారు. రజనీకాంతే ఎందుకు ఈ చిత్రాన్ని నిర్మించకూడదు? అని వాళ్లు అనుకుని ఉంటారు. ఇకపై నిర్మాతగా వ్యవహరించకూడదని 'బాబా' సినిమా అప్పుడే డిసైడ్ అయ్యాను. నా కూతురు విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అందుకే కొంత మంది ప్రొడ్యూసర్ల పేర్లను ఆమెకు సూచించి, వెళ్లమని చెప్పాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ప్రేరణ పొందిన ఈ స్టోరీని వినేందుకు గంట సమయం కావాలని ఐశ్వర్య నన్ను అడిగింది. దీన్ని నేను కాదనలేకపోయాను. ఈ సినిమా నేషనల్ అవార్డులను అందుకుంటుందని అంటూ కథ చెప్పడం ప్రారంభించింది. వెంటనే నేను వినకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అవార్డుల కోసమే సినిమాలు చేయకూడదు. అలాగని నేను వాటికి వ్యతిరేకిని కాదు. ఆర్థికంగా కూడా మంచి రిజల్ట్ పొందాలనుకుంటాను" అని రజనీ పేర్కొన్నారు.