NTR 101 Birth Anniversary : రాముడు, కృష్ణుడు అంటే టక్కున తెలుగువారి మదిలో మెదిలే ఒకే ఒక్క రూపం నందమూరి తారక రామారావు. అంతలా ఆయన ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. రూపంలో నిండుగా కనిపించేవారు. ఇంకా చెప్పాలంటే పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. సం భాషణలు, హావ భావాలు పలికించడంలో ఆయనకు మరెవరు సాటి రారు. అందుకే రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, రావణుడిగా ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన నటించి ఒదిగిపోయారు. అయితే ఈ పాత్రల్లో కృష్ణుడిగా అత్యధిక సార్లు కనిపించి రికార్డు కూడా క్రియేట్ చేశారు. మరి పౌరాణిక పాత్రలకు నిఘంటువు అనే ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రామారావు తన కెరీర్లో నారదుడు, హనుమంతుడి పాత్రలను మాత్రం పోషించలేదు.
అయితే ఆ పాత్రలు ఎందుకు పోషించలేదో ఓ సందర్భంలో ఎన్టీఆర్ ఇలా చెప్పారు. "నారదుడి పాత్ర పోషించడానికి ఆలోచించాను. అయితే హాస్యంలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శన చేయొచ్చు. కానీ అందుకు నా రూపం సహకరించదని అనిపించింది. అందుకే సాహసం చేయలేదు. పైగా నారదుడు అంటే ఇలానే ఉండాలి అనేలా ఓ రూపానికి అందరూ అలవాటు పడ్డాం.
అందుకే నా శరీరం కాస్త భారీగా ఉంటుందని ఆ ఆలోచనను పక్కనపెట్టాను. అదే రంగారావు గారిని నారదుడి పాత్రలో ఊహించగలమా? మా పర్సనాలిటీలు సెట్ అవ్వవు. ఇక హనుమంతుడు పాత్ర విషయానికొస్తే అది నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? నటిస్తే మాస్క్‌తో నటించాలి. ఫిజికల్ మూవ్‌మెంట్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి. అది కుదరదు" అని రామారావు చెప్పుకొచ్చారు.