NagAshwin Prabhas Kalki 2898 AD Movie Review :
చిత్రం: కల్కి 2898 ఏడీ;
నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శోభన, స్వాస్థ ఛటర్జీ, పశుపతి, కీర్తి సురేశ్ (వాయిస్ఓవర్), విజయ్ దేవరకొండ, మృణాళ్ఠాకూర్, దుల్కర్ సల్మాన్ తదితరులు;
సంగీతం: సంతోష్ నారాయణన్;
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు;
సినిమాటోగ్రఫీ: జోర్డే స్టోవిల్కోవిచ్;
సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా;
నిర్మాత: సి.అశ్వనీదత్;
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్;
Kalki 2898 AD Movie review : సైన్స్ ఫిక్షన్ మూవీకి పురాణాలను ముడిపెడుతూ కల్కి 2898 ఏడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నాగ్ అశ్విన్. రూ.600కోట్ల భారీ బడ్జెట్, నాలుగేళ్ల నిర్మాణం, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర తారాగణం నటించడంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఈ మూవీ ఆకర్షించింది. మరి ఆ అంచనాలను కల్కి అందుకుందా? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా? సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.
కథేంటంటే(Kalki 2898 AD story) : కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ (కమల్‌హాసన్). కాశీ బౌంటీ ఫైటర్ అయిన భైరవ (ప్రభాస్) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్-కె కోసం గర్భవతుల్ని చేసి, వారి నుంచి సీరమ్ సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా సుమతి (దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకీ, భైరవకీ సంబంధం ఏమిటి?సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ -కె లక్ష్యమేమిటి?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా?అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. కళ్లు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రలతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ, వాటికి మన పురాణాల్ని మేళవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బుర పరుస్తుంది.
కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళుతుంది సినిమా. ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకొస్తాడు. నీటి జాడ లేని భవిష్యత్తు కాశీ నగరం, ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్ దురాగతాలు కథలో లీనం చేస్తాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగునా హీరోల ఎలివేషన్ సన్నివేశాల్ని చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు. కానీ, నాగ్ అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సన్నివేశాల్ని మలచడం విశేషం. కథలోని మూడు ప్రపంచాలు వేటికదే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టి పడేస్తుంది. ప్రథమార్ధంలో అక్కడక్కడా సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించినా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్‌తో సాగుతుంది.