Bharateeyudu 2 Review:సినిమా: భారతీయుడు- 2; నటీనటులు: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు; ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్; సినిమాటోగ్రఫీ: రవి వర్మన్; సంగీతం: అనిరుధ్ రవిచందర్; నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్; రచన, దర్శకత్వం: ఎస్.శంకర్;
లోకనాయకుడు కమల్‌హాసన్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' శుక్రవారం (జులై 12) థియేటర్లలో విడుదల అయ్యింది. 1996లో బ్లాక్‌బస్టర్ హిట్ 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. భాషతో సంబంధం లేకుండా 28 ఏళ్ల కిందట ఈ సినిమా భారీ విజయం సాధించింది. మరి తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా రిలీజైన 'భారతీయుడు- 2' ఎలా ఉంది? సేనాపతి రెండోసారి ప్రేక్షకులను మెప్పించాడా?
కథేంటంటే: చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), ఆర్తి (ప్రియ భవానీ శంకర్) మరో ఇద్దరు స్నేహితులు కలిసి సమాజంలో అవినితి, అన్యాయాల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తుంటారు. చిన్న తప్పు చేసినా దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలని, అందుకు భారతీయుడు అలియాస్ సేనాపతి (కమల్‌హాసన్) రావాల్సిందేనని ఈ మిత్రబృందం భావిస్తుంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో విప్లవం మొదలవుతుంది. ఆ పిలుపు అందుకున్న సేనాపతి మాతృభూమిపైకి అడుగు పెడతాడు. ఇన్నాళ్లూ ఆయన ఎక్కడున్నాడు? తిరిగొచ్చిన తర్వాత ఆయన సమాజంలో కుళ్లుని కడిగేయడం కోసం ఏం చేశాడు? ఆ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి? ఆయన కోసం కాపు కాసిన సీబీఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహా) భారతీయుడిని అరెస్ట్ చేశాడా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: 28ఏళ్ల కిందట వచ్చిన 'భారతీయుడు'లో కథ మొదలుకొని గెటప్, మ్యూజిక్ ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా ప్రేక్షకుల్ని ప్రభావితం చేసిందా సినిమా. అలాంటి సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ అంటే అంచనాలు మరో స్థాయికి చేరుకుంటాయి. పైగా అప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సినిమాల రూపకల్పనలోనూ, ప్రేక్షకుల అభిరుచులు, ఆలోచనల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. అవన్నీ పరిగణనలోకి తీసుకుని సీక్వెల్‌పై భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్‌కి వెళతారు.
అయితే అక్కడక్కడా ఒకట్రెండు సన్నీవేశాలు తప్ప మిగతా ఏ అంశంలోనూ 'భారతీయుడు'కి దీటుగా లేకపోవడం ప్రేక్షకులు నిరాశకు గరవుతున్నారు. ఫస్ట్ పార్ట్‌లో మర్మ కళను ప్రస్తావించగా, ఇందులో మర్మ కళను చూపించారు. అది మినహా కథలో కొత్తదనం లేదు. స్టోరీ అంతా దాదాపు తొలి భాగాన్నే పోలి ఉంది. కన్న కొడుకు అని కూడా ఉపేక్షించని సేనాపతి, ఈసారి కూడా మన కాళ్ల కిందే కలుపు మొక్కలు ఉన్నాయంటూ యువతరాన్ని ముందుకు కదిలించడం కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకూ ఆ నేపథ్యంలో సంఘర్షణైనా ఉంది.
కానీ, సెకండ్ హాఫ్‌లో దాదాపు టామ్ అండ్ జెర్రీ ఆటే. అప్పట్లో వచ్చిన 'భారతీయుడు'లో సేనాపతి ఆచూకీని కనిపెట్టే తీరు, అతని మర్మకళ విద్య, స్వాతంత్ర్యపోరాటం ఇలా చాలా విషయాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ, ఇందులో అవేవీ లేవు. టెక్నాలజీ ఇంతగా పెరిగినా సవాళ్లు లేకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు సేనాపతి. దాంతో డ్రామా పెద్దగా ఆసక్తిగా అనిపించదు. ఎమోషన్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. క్లైమాక్స్‌లో మూడో భాగం అంటూ చూపించిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.