Heroine Nayanthara Comments on Plastic Surgery : ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా హీరోయిన్లు తాము ఈ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ నయనతార కూడా ఈ విషయంపై స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను ఖండించింది. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడింది.
"నా కను బొమలు అంటే చాలా ఇష్టం. వాటి ఆకారాన్ని ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాను. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు వీటిని మార్చుతాను. వాటి కోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తాను. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ఫేస్‌లో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకుని ఉండొచ్చు. వాళ్లు అనుకున్నది మాత్రం నిజం కాదు. అలాగే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కో సారి బుగ్గులు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు కనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి కూడా చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు" అని నయనతార చెప్పుకొచ్చింది.