Happy Birthday Allu Arjun Diet and Fitness Tips :గంగోత్రి సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ తన స్టైలిష్ యాటిట్యూడ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగా రెండు దశాబ్ధాల నుంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అలానే తన ఫిట్నెస్ను కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు టాలీవుడ్‌కు సిక్స్ ప్యాక్‌ను కూడా ఆయనే దేశముదురుతో పరిచయం చేశారు. అలా ఫ్యాషన్‌తో పాటు ఫిట్నెస్ విషయంలోనూ తన అభిమానులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు ఐకాన్ స్టార్. అయితే నేడు(ఏప్రిల్ 8) బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫిట్నెస్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
బన్నీ తన ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారట. అస్సలు రాజీపడరని తెలిసింది. ఆ మధ్య తన డైట్, వ్యాయామాలు గురించి ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ దీనిని ఫాలో అవ్వొచ్చు.
అల్లు అర్జున్ ప్రతి రోజూ ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో 45 నిమిషాల నుంచి గంట వరకు పరిగెడతారట. తన మెటబాలీజం పెరగడంలో ఇది బాగా తోడ్పడుతుందని ఆయన అన్నారు. సినిమాకు తగ్గట్లు తన డైట్ ఉంటుందని అన్నారు. లంచ్, డిన్నర్ తన డైట్ ఆధారంగా మారుతూ ఉంటుందని అన్నారు. బ్రేక్ ఫాస్ట్ మాత్రం దాదాపుగా ఎప్పుడూ ఒకటే ఉంటుందని చెప్పారు. ఎగ్స్ కచ్చితంగా ఉంటాయట. పోస్ట్ వర్క్ ఔట్‌కు ముందు ప్రోటీన్ షేక్స్, డ్రింక్స్ లాంటి తీసుకుంటానని చెప్పారు.