Director Atlee Next Project : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో జవాన్ తీసి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన అట్లీ తన తర్వాత సినిమాను ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదు. దీంతో సినీ ప్రియులంతా దర్శకుడు అట్లీ తర్వాత ప్రాజెక్ట్ ఏంటనే దాని గురించే ఆలోచిస్తున్నారు. అయితే, తాజాగా తాను నిర్మాతగా వ్యవహరించిన బేబీ జాన్ చిత్రంతో ప్రమోషన్‌లో మాట్లాడుతూ తన తరువాత ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"నా ఆరో సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తైయ్యాయి. ఇది ఔట్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. కచ్చితంగా ఇందులో నటీ నటులను చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎవరి ఊహలకు అందనివిధంగా ఇది ఉంటుంది. దేశం గర్వించేలా ఉంటుంది. నటీనటుల ఎంపిక చివరిదశకు చేరుకుంది. త్వరలోనే క్యాస్టింగ్ ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇస్తాను. మీ అందరి అభిమానం, ఆశీర్వాదాల వల్ల మంచి సినిమాతో మిమ్మల్ని అలరించడానికి రెడీ అవుతున్నాను. త్వరలోనే దీని గురించి మరిన్ని వివరాలు తెలుపుతాను" అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో హీరో గురించి మాత్రం తెలుపలేదు. దీంతో సినిమాలో హీరో ఎవరనే విషయమై అందరూ తెగ చర్చించుకుంటున్నారు.
కాగా, సల్మాన్ ఖాన్‌తో దర్శకుడు అట్లీ ఓ చిత్రం చేయనున్నట్లు ఎన్నో రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. అలాగే పుష్ప 2తో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న అల్లు అర్జున్‌తో అట్లీ చర్చలు జరిపారని టాక్ వినిపించింది.