Abroad Higher Education Guide :ప్రస్తుత కాలంలో ఉన్నత విద్య కోసం చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు పెరగడం వల్ల, ఈ లక్ష్య సాధనకు కావాల్సిన అన్ని అంశాల్లో పోటీ నెలకొంది. విదేశాల్లో విద్యకు ఖర్చులు భారీగానే అవుతాయి. అయితే, ఈ విదేశీ విద్యకు బయలుదేరడానికి ముందు దీనికి సంబంధించి ప్రక్రియ ఉంటుంది. విదేశీ విద్యార్థులకు మంచి మొత్తంలో ఉపకార వేతనాలు అందించే సంస్థలున్నప్పటికీ, అద్భుతమైన పనితీరు ఉన్న విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్స్ వస్తాయి. ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులు విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ప్రక్రియలో వివిధ అవసరాల కోసం ఖర్చులు అవుతాయి. ఈ క్రమంలో వేటికి, ఎలాంటి ఖర్చులుంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
అబ్రాడ్ స్టడీ కన్సల్టెన్సీ
విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునేటప్పుడు విద్యార్థులు అనేక విదేశీ ఏజెన్సీలను సంప్రదించాలి. ఈ సంస్థలు విద్యార్థులకు విదేశీ విద్య, ఇమిగ్రేషన్ ప్రక్రియతో పాటు మరిన్ని విషయాలను తెలియజేస్తాయి. ఈ ఏజెన్సీలు ఉన్నత విద్య కోసం సరైన కోర్సు, విశ్వవిద్యాలయం, దేశాన్ని ఎంచుకోవడానికి విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తాయి. కొన్ని కన్సల్టెంట్స్ తమకు టైఅప్ అయిన విద్యా సంస్థల నుంచి కమీషన్లు పొందడం వల్ల ఉచితంగా పనిచేసే అవకాశం ఉంది. మరికొన్ని ఏజెన్సీలు విద్యార్థుల నుంచి ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు ఏజెన్సీల పరిధిని బట్టి మారుతుంటాయి.
ఇంగ్లిష్లో ప్రావీణ్యం
విదేశాల్లోని విద్యా సంస్థలకు దరఖాస్తు చేయడానికి, విద్యాపరంగా ఆంగ్ల భాషా ప్రావీణ్య రుజువు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని పరీక్షలకు అప్లై చేసుకోవాలి. ఉదాహరణకు IELTS, TOEFL, PTE, SAT పరీక్షలు రాసి ఉత్తీర్ణుతులు అవ్వాలి. ఈ పరీక్షల కోసం దరఖాస్తు ధర వివిధ దేశాల్లో వారి అంగీకార శాతం ఆధారంగా మారవచ్చు. TOEFL, GRE పరీక్ష ఫీజులు భారతీయ కరెన్సీలో రూ. వేలల్లోనే ఉండొచ్చు.
కోర్సు అప్లికేషన్
విదేశీ విశ్వవిద్యాలయాల్లో కోర్సు కోసం విద్యార్థులు అప్లై చేసుకోవాలి. విదేశాల్లో అధ్యయనం చేసే ప్రోగ్రామ్లకు అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడానికి ఛార్జీలు ఉంటాయి. విద్యార్థి అర్హతలను గుర్తించడానికి ఈ దరఖాస్తులో సమాచారం ఆయా కళాశాలలకు ఉపయోగపడుతుంది. ఈ దరఖాస్తుకుగాను ఆయా విద్యాలయాలు ఫీజును వసూలు చేస్తాయి. ఆయా విశ్వవిద్యాలయంలో సీటు వచ్చినా, రాకపోయినా ఈ రుసుం తిరిగి చెల్లించరు. కాబట్టి, మీరు సరైన విచారణ, పరిశోధన తర్వాతే ఏదైనా కోర్సును ఎంచుకోండి. ఉదాహరణకు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో దరఖాస్తు ధర సుమారు 150 డాలర్లు (రూ.12,500) ఉండొచ్చు. విద్యార్థులు దరఖాస్తు చేస్తున్న కోర్సు/ప్రోగ్రామ్ను బట్టి ఇది మారుతూ ఉంటుంది. మీరు ఎన్ని విశ్వవిద్యాలయాల్లో దరఖాస్తు చేస్తే అన్ని దరఖాస్తులకు ఫీజును కట్టాల్సి ఉంటుంది.