Free Education Abroad: ప్రపంచంలోనే పేరెన్నికగన్న యూనివర్సిటీలు వివిధ రకాల కోర్సులను ఉచితంగా అందిస్తున్నాయి. గేమ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఫొటోగ్రఫీ, మ్యూజిక్, గేమ్ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్, జర్నలిజం ఇలాంటి కోర్సులని విదేశీ యూనివర్సిటీలు ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. విదేశీ అనగానే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఆన్లైన్ ద్వారా పూర్తి చేసే వీలుంది.
ప్రఖ్యాతిగాంచిన విదేశీ యూనివర్సిటీలు ఉచిత ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరి కోసం తమ విద్యాసంస్థల్లో ప్రమాణాల స్థాయిని పరిచయం చేస్తున్నాయి. అంతే గాకుండా విద్యార్థులు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేందుకు ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఇటువంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన విభాగాల్లో ప్రాథమికాంశాలు ఉచితంగా నేర్చుకునే వీలుంటుంది. అంతేగాకుండా విదేశీ యూనివర్సిటీలో చదివామనే తృప్తి లభిస్తుంది.
జాబ్ మార్కెట్లోనూ చక్కని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి అధికశాతం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో అనుసంధానమై పనిచేస్తుండగా, సంబంధిత వర్సిటీ అధ్యాపకులే ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా బోధిస్తున్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీ
ఐవీ లీగ్‌లో ముఖ్యమైన, పురాతనమైన హార్వర్డ్ యూనివర్సిటీ దాదాపు 600కు పైగా కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన ఎలా ఉంటుందనే విషయం తెలిసేలా ఈ కోర్సులు ఉంటాయి. కోర్సుల కాల వ్యవధి ఒకటి నుంచి పన్నెండు వారాల వ్యవధి ఉంటుంది. సాహిత్యం, న్యాయశాస్త్రం, బిగ్‌డేటా, సామాజిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ప్రోగ్రామింగ్, గేమ్ డెవలప్మెంట్, చరిత్ర, న్యూరోసైన్స్ ఇలా విభిన్న అంశాలను హార్వర్డ్ వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇవేకాక మోడరన్ టెక్నికల్ కోర్సులైన మెషిన్ లెర్నింగ్, పైతాన్ లాంగ్వేజ్, గేమ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి వాటిలోనూ ప్రాథమిక అంశాలు అభ్యసించే వీలుంది.
జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఈ విద్యాసంస్థ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ - మాక్స్ ద్వారా ఆన్లైన్ కోర్సులను అందిస్తోంది. దాదాపు ముప్ఫై లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. వివిధ ర్యాంకింగ్ సిస్టమ్స్‌లో పోటీ పడి టాప్ ర్యాంకులు పొందిన కోర్సులు కూడా ఇవే కావడం విశేషం. బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, సప్లైచెయిన్ అండ్ లాజిస్టిక్స్ అనే విభాగాల్లో మొత్తం 30 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూఎక్స్ డిజైన్, డేటా అనాలిసిస్, డేటా అనలిటిక్స్, పైతాన్, జావా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిదమ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, మెకానిక్స్, మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ డిజైన్, అనలిటిక్స్ మోడలింగ్, స్టాటిస్టిక్స్, ఇన్నోవేషన్ లీడర్షిప్, సప్లై చెయిన్ ప్రిన్సిపల్స్ వంటి అనేక అంశాలు అభ్యసించే వీలుంది. ఎడ్ఎక్స్, కోర్సెరా, ఉడాసిటీ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)...
సైంటిఫిక్ థియరీలను నేర్చుకునే క్రమంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)తో పోటీపడే యూనివర్సిటీలు లేవనే చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో ఈ కళాశాల వివిధ కోర్సులు ఆఫర్ చేస్తోంది. వాటిలో ప్రధానంగా ఇంజినీరింగ్, జాగ్రఫీ, కాగ్నిటివ్ సైన్స్, హిస్టరీ, ఏరోనాటిక్స్, ఫిజిక్స్, ఎకనమిక్స్, లింగ్విస్టిక్స్ - ఫిలాసఫీ, అర్బన్ స్టడీస్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంత్రొపాలజీ, మీడియా స్టడీస్, బయాలజీ, న్యూక్లియర్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. దాదాపు అన్నిరకాలైన సబ్జెక్టులపై 3 వేల కోర్సులు ఈ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. నేరుగా డౌన్లోడ్ చేసుకుని చదివే కోర్సులతో పాటు ఇంటరాక్టివ్ పద్ధతిలో లభించేవి విడివిడిగా అందుబాటులో ఉన్నాయి. సైంటిఫిక్ థియరీలను నేర్చుకునే క్రమంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ముందంజలో ఉంది.