Highest Paying Job Opportunities for Women in 2024 :చాలా మంది మహిళలు మంచి ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతుంటారు. ఏదైనా గ్రేట్ జాబ్ ఆపర్చూనిటీ లభిస్తుందేమోనన్న ఆశాభావంతో జాబ్ సెర్చ్ చేస్తుంటారు. తమ విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలకు సరిపడే ఉద్యోగ అవకాశం కోసం అలుపెరుగకుండా ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. 2024 సంవత్సరంలో మహిళలు భారీ ప్యాకేజీలు పొందేందుకు దోహదపడే ఉద్యోగ అవకాశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- హెల్త్‌కేర్ ఇండస్ట్రీ
హెల్త్‌కేర్ ఇండస్ట్రీ ఇప్పుడు జెట్ వేగంతో విస్తరిస్తోంది. మన దేశంలో జనాభా ఎంత స్పీడుగా పెరుగుతోందో, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ కూడా అంతే స్పీడుగా పురోగమిస్తోంది. ఆస్పత్రుల సంఖ్య ఎంతగా పెరుగుతూపోతోందో మనం కళ్లారా చూస్తున్నాం. వాటన్నింటిలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు, హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులు ఉంటాయి. వీటిలో చేరే వారికి మంచి సాలరీ ప్యాకేజీ లభిస్తుంది. - ఎంట్రప్రెన్యూర్‌షిప్
సొంత వ్యాపారం అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్! మహిళలు టెక్, రిటైల్, హెల్త్‌కేర్, ఇతర పరిశ్రమలలో సొంతంగా వ్యాపారాలను ప్రారంభించొచ్చు. వాటిని సరైన ప్రణాళికతో ప్రారంభించి, విజయవంతంగా నిర్వహించగలిగితే అద్భుతమైన పురోగతి సొంతమవుతుంది. ఎంతో మంది మహిళా వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఈ విధంగా సక్సెస్ అవుతున్నారు. - వినోదం, మీడియా
ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ రంగాలకు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఇది క్రియేటివిటీతో కూడుకున్న ఫీల్డ్. ఈ రంగంలో నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిక్యూటివ్‌లుగా మహిళలు బాగానే రాణిస్తున్నారు. ఆకర్షణీయమైన పారితోషకాలు అందుకుంటున్నారు. - లా (LAW)
మన దైనందిన జీవితంలోని చాలా పనులు 'లా'తోనే ముడిపడి ఉంటాయి. లా కోర్సులు పూర్తి చేసి మహిళలు లాయర్లు, జడ్జీలు కావొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా, ఇంటర్నేషనల్ లా చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులు చేసిన వారికి ప్రముఖ లీగల్ కన్సల్టెన్సీలు ఆకర్షణీయమైన సాలరీ ప్యాకేజీతో ఉద్యోగాలు కూడా ఇస్తున్నాయి. - ఇంజినీరింగ్
ఇంజినీరింగ్ రంగంలో గతంలో పురుషుల ఆధిక్యం ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు కూడా సత్తా చాటుకుంటున్నారు. సివిల్ ఇంజినీరింగ్ అనేది పాత ట్రెండ్. ఇప్పుడు పెట్రోలియం ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు చేసిన వాళ్లకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తున్నాయి. అంకితభావంతో కోర్సులను పూర్తి చేయగలిగితే, ఈ అవకాశాలను మహిళలు చాలా ఈజీగా అందిపుచ్చుకోవచ్చు. - టెక్నాలజీ
ఇది టెక్ యుగం. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగాల్లో స్పెషలైజేషన్ ఉన్నవారు తక్కువగా ఉండటంతో మంచి ప్యాకేజీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ప్రస్తుతానికి పురుషులకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఒకవేళ ఈ కోర్సులపై మహిళలు పట్టును సంపాదించగలిగితే వారికి కూడా కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తాయి. - ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్
ఆర్థిక సేవల రంగం ఎవర్ గ్రీన్. మనిషి జీవితం అనేది ఆర్థిక అంశాల చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే ఈ రంగంలో అవకాశాలు కోకొల్లలుగా ఉంటాయి. ప్రత్యేకించి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, అసెట్ మేనేజ్‌మెంట్ సహా ఫైనాన్స్ రంగంలో మంచి కెరీర్ అవకాశాలు ఉన్నాయి. మంచి అవగాహన, అనుభవం, నైపుణ్యాలు ఉన్న మహిళలకు అద్భుతమైన సాలరీ ప్యాకేజీలను ఆర్థిక సేవల రంగంలోని కంపెనీలు అందిస్తాయి. - కన్సల్టింగ్
మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలు మంచి నిపుణుల కోసం నిత్యం అన్వేషిస్తుంటాయి. కంపెనీలకు బిజినెస్ స్ట్రాటజీని తయారు చేసి ఇచ్చే, సంస్థాగత అభివృద్ధికి ప్రణాళికను అందించే, ఫైనాన్స్ విభాగానికి దిశానిర్దేశం చేసే నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఈ నైపుణ్యాలను అర్హులైన మహిళలు సంపాదించగలిగితే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలు ఘన స్వాగతం పలుకుతాయి. నైపుణ్యం, అనుభవం, సమయ స్ఫూర్తి, దార్శనికత ఉంటే ఈ రంగంలో భారీ జీతాలు లభిస్తాయి. - ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ
ఫార్మా రంగం చాలా ముఖ్యమైంది. వైద్యరంగానికి ఆరోప్రాణం ఇదే. ఈ రంగంలో నిత్యం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం యాక్టివ్‌గా పనిచేస్తూనే ఉంటుంది. ఔషధాల తయారీ నుంచి మార్కెటింగ్ దాకా చాలా విభాగాలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ రంగంలో ఉండే బోలెడు విభాగాల్లో కనీసం ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించుకుంటే ఉజ్వల భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. క్లినికల్ ట్రయల్స్ మేనేజ్‌మెంట్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీలలో మంచి కెరీర్ ఉంటుంది. వేతనాలు అద్భుతంగా ఉంటాయి. - ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్
కంపెనీల్లో ప్రతీ ఉద్యోగీ ముఖ్యమే. ప్రతీ విభాగమూ ముఖ్యమే. అయితే వీరందరిని కలుపుకొని ముందుకు నడిచే కేంద్ర నాయకత్వం అతి ముఖ్యం. కంపెనీల్లో సీఈవోలు, సీఎఫ్‌ఓలు, సీఓఓ పోస్టులకు అందుకే చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. మేనేజ్‌మెంట్‌కు సన్నిహితంగా పనిచేసే అవకాశం వీరికి లభిస్తుంది. ఇలాంటి పోస్టులలో మహిళలకు ప్రయారిటీ ఇస్తుంటారు. భారీ జీతాలు, అదనపు ప్రోత్సాహకాలు ఈ పోస్టులలో ఉండే వారికి లభిస్తుంటాయి.