తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

పరీక్షలు​ అంటేనే భయంగా ఉందా? ఈ 9-టిప్స్ పాటిస్తే విజయం మీదే! - Exam Anxiety - EXAM ANXIETY

How To Overcome Exam Anxiety : మీరు అకడమిక్​/పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? కానీ వాటిని తలచుకుంటేనే భయం వేస్తోందా? అయితే ఇది మీ కోసమే. ఎగ్జామ్​ యాంగ్జైటీ (ఆందోళన)ని కొన్ని సింపుల్​ టిప్స్​తో అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Deal with Exam Stress
What is Exam Anxiety, How to Deal with it? (Etv Bharat Telugu Team)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 10:46 AM IST

How To Overcome Exam Anxiety : పరీక్ష ఏదైనా సరే ఎంతో కొంత టెన్షన్‌ ఉండడం సహజం. అయితే కొందరు విద్యార్థులు మాత్రం మరీ కంగారు పడిపోతూ ఉంటారు. పరీక్షల గురించి తలచుకుని ఆందోళన చెందుతుంటారు. దీని వల్ల ముందుగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఇబ్బందిపడతారు. ఫలితంగా పరీక్షలు కూడా సరిగ్గా రాయలేకపోతారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఎగ్జామ్ యాంగ్జైటీని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం.

  1. పరీక్షలు రాసేవారు ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎగ్జామ్స్ అంటే కాస్త కంగారుగా ఉండడం సహజమే. అయితే దాన్ని అంత సీరియెస్​గా తీసుకోకూడదు. ఒకవేళ మీరు అతిగా ఆందోళన చెందితే, మీరు చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనిని అధిగమించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు పాటించాలి.
  2. పరీక్షల ముందు కలిగే ఆందోళన, కంగారులను పెర్ఫార్మెన్స్​ యాంగ్జైటీ అని చెప్పవచ్చు. ఎలా అయినా పరీక్ష బాగా రాయాలనే బలమైన కోరిక ఉండడం లేదా ఎగ్జామ్ పాస్​ అవుతామా, లేదా అనే భయం ఉండడమే ఈ యాంగ్జైటీకి కారణం. వాస్తవానికి యాంగ్జైటీ అనేది తక్కువ స్థాయిలో ఉంటే, మీకు మంచి ప్రేరణ కలిగిస్తూ సత్ఫలితాలను ఇస్తుంది. కానీ ఇదే యాంగ్జైటీ ఎక్కువ అయితే మాత్రం మానసికంగా, శారీరకంగా ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్ యాంగ్జైటీకి లోనైనవారి గుండె వేగం పెరుగుతుంది. తలనొప్పి, వికారం, కోపం, చిరాకు వస్తాయి. అన్ని పనులు వాయిదా వేయాలి అనిపిస్తుంది.
  3. ఈ ఆందోళన తగ్గాలంటే, పరీక్ష కేంద్రానికి కాస్త ముందుగానే వెళ్లాలి. అక్కడ కాసేపు కూర్చుని చదువుకోవడం, లేదా సరదాగా పచార్లు చేయడం లాంటివి చేయాలి. దీని వల్ల ఆ పరిసరాలు మీకు అలవాటు అయ్యి, కొత్త ప్రదేశం అనే భావన పోతుంది. కొంత వరకు కంగారు తగ్గుతుంది. మనస్సు తేలిక అవుతుంది. అందువల్ల పరీక్షలు బాగా రాయగలుగుతారు.
  4. కొంత మంది పరీక్షల సమయంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా చదువుతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఒక పక్కా ప్రణాళిక వేసుకుని, దాని ప్రకారం చదవాలి.
  5. రాత్రిళ్లు తగినంత సమయం నిద్రపోవాలి. ఇది కేవలం పరీక్ష ముందు రోజు రాత్రి మాత్రమే కాదు. ప్రిపరేషన్ టైమ్​లో కూడా ఇలానే చేయాలి. అప్పుడే మీరు చదివిన సమాచారం మొత్తాన్ని మెదడు నిక్షిప్తం చేసుకోగలుగుతుంది. అంతేకాదు చక్కని నిద్ర మీలోని ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
  6. సాధన చేస్తూ ఉంటే, ఎంత క్లిష్టమైన అంశమైనా చాలా సులువుగా గుర్తుండిపోతుంది. పదే పదే సాధన చేస్తే, అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి యాంగ్జైటీని దూరం చేస్తుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ప్రణాళికబద్ధంగా చదవడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది.
  7. చాలా మంది పరీక్షల సమయంలో ఫిజికల్ యాక్టివిటీస్​కు చాలా దూరంగా ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. రోజుకు కనీసం ఒక గంట సేపు అయినా వ్యాయామం చేయాలి. దీని వల్ల శారీరకంగా, మానసికంగా మీకు మేలు కలుగుతుంది. చిన్న చిన్న బరువులెత్తడం, వాకింగ్‌కు వెళ్లడం, యోగా లాంటివి చేయడం వల్ల, మీరు శారీరకంగా యాక్టివ్‌గా ఉంటారు. ఫలితంగా ఎగ్జామ్​ యాంగ్జైటీ దూరం అవుతుంది. అలాగే మీరు డీప్‌ బ్రీతింగ్, మెడిటేషన్​, ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్ లాంటివి కూడా చేయవచ్చు. దీని వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
  8. పరీక్షలో పాస్ అవుతామో, లేదో అని కంగారు పడాల్సిన పనిలేదు. కచ్చితంగా విజయం సాధిస్తాం అని గట్టిగా నమ్మాలి. విజయాన్ని ఊహించుకోవాలి. దీని వల్ల కూడా అనవసర ఆందోళన తగ్గుతుంది.
  9. అవసరమైతే మీ కుటుంబ సభ్యుల, ఉపాధ్యాయుల, తోటి విద్యార్థులు/ స్నేహితుల సహాయం తీసుకోవాలి. తప్పనిసరి అయితే నిపుణుల సలహాలు తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఈ చిట్కాలు అన్నీ పాటిస్తే మీకు ఉన్న పరీక్షల భయం పూర్తిగా తగ్గుతుంది. పరీక్షలో కచ్చితంగా విజయం సాధించగలుగుతారు. ఆల్​ ది బెస్ట్​!

ABOUT THE AUTHOR

...view details