తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

బీటెక్ కన్వీనర్‌ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే? - 15 శాతం నాన్​లోకల్​ కోటా ఎత్తివేత - TG ENGINEERING CONVENER SEATS

నేడు ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ - బీటెక్‌ కన్వీనర్‌ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే - ఈసారి 15 శాతం నాన్‌లోకల్‌ కోటా ఎత్తివేత

Engineering Seats In Telangana
Engineering Convener Seats In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 2:07 PM IST

Engineering Convener Seats In Telangana :తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటి వరకు కొనసాగిన 15శాతం అన్ రిజర్వుడ్ (నాన్ లోకల్) కోటా రద్దు అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఇంజినీరింగ్‌ సీట్లను 70 శాతం కన్వీనర్‌ కోటా 30 శాతం బి కేటగిరీ(యాజమాన్యం) కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్‌ కోటాలోని సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఇచ్చేవారు.

కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే :రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తకావడంతో స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది.

ఇంజినీరింగ్‌ సీట్లు :దీనిపై కమిటీ ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డిని వివరణ కోరగా నివేదిక అందజేశామని, 95-5 కోటాపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. తుది నిర్ణయం వెలువడనందున ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయన్నారు. నిబంధన విధించి ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు 15 శాతం అన్‌ రిజర్వుడ్‌ కోటాలో మొత్తం 12 వేల సీట్లు ఉండగా అందులో 4-5 వేల సీట్లు మెరిట్‌ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతున్నారు.

ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ : తెలంగాణలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌-2025 నోటిఫికేషన్‌ జేఎన్‌టీయూహెచ్‌ జారీ చేయనుంది. నోటిఫికేషన్‌ వివరాలు గురువారం మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్‌ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏపీ సరిహద్దులోని తెలంగాణ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏపీలో ఆ రెండు నగరాలతో పాటు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈ నెల 25 లోపు ఏపీ విద్యార్థుల విషయంపై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. లేనిపక్షంలో ఏపీ విద్యార్థులు పరీక్ష రాయాలా? లేదా అన్న ప్రశ్నలు తలెత్తనున్నాయి.

బీటెక్ తర్వాత సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడాలంటే ఈ కోర్సులు చేయాల్సిందే!

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అలర్ట్ - సిలబస్‌లో సమూల మార్పులు

ABOUT THE AUTHOR

...view details