Job Interview Vocabulary :కొత్తగా జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లు తెలిసీ, తెలియక కొన్ని రకాల పదాలు వాడుతుంటారు. దీని వల్ల వారి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుంటాయి. మరికొందరు చాలా సార్లు ఇంటర్వ్యూకు వెళ్లినా, తాము చేస్తున్న తప్పు ఏమిటో తెలుసుకోరు. దీని వల్ల సరైన ఉద్యోగం సంపాదించలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకే ఇంటర్వ్యూలో వాడకూడని పదాలు, ప్రదర్శంచకూడని భావోద్వేగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నో (No)
ఈ పదాన్ని వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది. వాస్తవానికి 'నో' అని చెప్పడంలో తప్పులేకపోయినా, ఇంటర్య్వూ చేసే వ్యక్తికి మీపై ప్రతికూల భావాన్ని కలిగించవచ్చు. ఉదాహరణకు, సెలవు రోజుల్లో మీరు అందుబాటులో ఉండటం వీలవుతుందా? అని ఎంప్లాయర్ అడిగారు అనుకుందాం. అప్పుడు మీరు ‘నో’ అని అనకుండా, అవసరాన్ని బట్టి కచ్చితంగా హాజరవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాలి. ఇలా సానుకూల పదాలతో మీ సమాధానాన్ని చెప్పాలి. అప్పుడే మీపై ఇంటర్వ్యూ చేసేవారికి సదభిప్రాయం కలుగుతుంది.
పర్ఫెక్షనిస్ట్ (Perfectionist)
మీ బలాలు, బలహీనతల గురించి ప్రశ్నించినప్పుడు, 'నేను చాలా పెర్ఫెక్షనిస్ట్'ని అని అనకూడదు. బాధ్యతలను సక్రమంగా, సకాలంలో పూర్తిచేస్తానని నమ్మకంగా చెప్పాలి. 'పర్ఫెక్షనిస్ట్' అనే పదం వాడితే, ఎదుటివారు దానిని అతిశయంగా భావించవచ్చు.
నేను (I am)
మీ నైపుణ్యాలు, అనుభవాలు, అర్హతల గురించి చెప్పమంటే, కచ్చితంగా ‘నేను’ అంటూ మీ గురించి చెప్పవచ్చు. అలా కాకుండా టీమ్ వర్క్ గురించి మాట్లాడేటప్పుడు 'నేను' అనే పదం వాడకూడదు. జట్టుతో కలిసి సమష్టిగా పని పూర్తి చేస్తానని, మా టీమ్ సహకారంతో సంస్థ వృద్ధికి తోడ్పడతానని చెప్పాలి. ఇక్కడ కూడా ప్రతి మాటకు ముందు, వెనుక 'నేను' అనే పదం వాడకూడదు. ఒకవేళ వాడితే, మీకు టీమ్ స్పిరిట్ లేదనుకుంటారు. వ్యక్తిగత ఎదుగుదలపై మాత్రమే మీకు ఆసక్తి ఉందని భావిస్తారు.