What Is UPI Circle :డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించేందుకు 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) ఇటీవలే 'యూపీఐ సర్కిల్'ను లాంఛ్ చేసింది. ఇది ఒక డెలిగేటెడ్ పేమెంట్ ఫీచర్. అంటే ఒక ప్రైమరీ యూజర్ తనకు నమ్మకమైన వ్యక్తులకు పేమెంట్ బాధ్యతలను అప్పగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ఆగస్టు నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా ఈ నయా యూపీఐఫీచర్ను లాంఛ్ చేసింది ఎన్పీసీఐ. భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్‌ను మరింత పెంచడమే దీని లక్ష్యం.
యూపీఐ సర్కిల్ అంటే ఏమిటి?
యూపీఐ సర్కిల్ అనేది ఒక డెలిగేటెడ్ పేమెంట్ ఫీచర్. దీని ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజర్, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకు (సెకెండరీ యూజర్లకు) పేమెంట్స్ చేసే బాధ్యతను అప్పగించడానికి వీలవుతుంది. అంతేకాదు ప్రైమరీ యూజర్, సెకెండరీ యూజర్లకు ఫుల్ యాక్సెస్ ఇవ్వవచ్చు. లేదా పాక్షికంగా పేమెంట్స్ చేసే అవకాశం మాత్రమే ఇవ్వవచ్చు. అంతేకాదు వారు చేసే ఆర్థిక లావాదేవీలను కూడా ప్రైమరీ యూజర్ కంట్రోల్ చేయవచ్చు. ఈ విధానం వల్ల మరింత ఎక్కువగా, సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుందని ఎన్పీసీఐ చెబుతోంది.
యూపీఐ సర్కిల్ ఎలా పనిచేస్తుంది?
యూపీఐ సర్కిల్లో రెండు రకాల యూజర్లు ఉంటారు. వారు:
1. ప్రైమరీ యూజర్
2. సెకెండరీ యూజర్
ప్రైమరీ యూజర్ యూపీఐ సర్కిల్‌ను ప్రారంభిస్తాడు. డెలిగేషన్ను కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. ప్రైమరీ యూజర్ తన యూపీఐ అకౌంట్‌ను మేనేజ్ చేయడానికి, తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను నియమించుకుంటాడు. వీరినే సెకెండరీ యూజర్లు అంటారు. వీరు పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతి ఇస్తాడు. అది ఎలాగో ఇప్పుడు మరింత వివరంగా చూద్దాం.
ఫుల్ డెలిగేషన్
ప్రైమరీ యూజర్, ముందే నిర్దేశించిన మొత్తం వరకు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి సెకెండరీ యూజర్లకు అనుమతి ఇస్తాడు. కనుక ఆ పరిమితి వరకు సెకెండరీ యూజర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా పేమెంట్స్ చేయగలుగుతారు. ఇందుకోసం ప్రతిసారీ ప్రైమరీ యూజర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనినే ఫుల్ డెలిగేషన్ అని అంటారు.
పార్శియల్ డెలిగేషన్
సెకెండర్ యూజర్లు నిర్దేశిత మొత్తం వరకు యూపీఐ లావాదేవీలు చేయగలుగుతారు. కానీ ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్ అథంటికేషన్ అవసరం అవుతుంది. అంటే ప్రైమరీ యూజర్ - యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తేనే, సెకెండరీ యూజర్లు చేసిన లావాదేవీలు ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఎన్పీసీఐ గైడ్‌లైన్స్ ఏం చెబుతున్నాయి?
యూపీఐ సర్కిల్ ఫీచర్ కోసం ఎన్పీసీఐ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- యూపీఐ సర్కిల్లో ప్రైమరీ యూజర్, సెకెండరీ యూజర్లు ఉంటారు.
- సెకెండరీ యూజర్లకు యాప్ పాస్‌కోడ్/ బయోమెట్రిక్స్ తప్పనిసరిగా ఉండాలి.
- ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా 5 మందిని సెకెండరీ యూజర్లుగా తీసుకోవచ్చు.
- ఒక డెలిగేషన్కు, ఒక నెలలో గరిష్ఠంగా రూ.15,000 వరకు పరిమితి ఉంటుంది.
- ఫుల్ డెలిగేషన్ మాగ్జిమమ్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5000 వరకు ఉంటుంది.
- ఇప్పటికే ఉన్న యూపీఐ పరిమితిలు పార్శియల్ డెలిగేషన్కు కూడా వర్తిస్తాయి.
- డైలీ ట్రాన్సాక్షన్ లిమిడ్ రూ.5000 దాటిన తరువాత మరో 24 గంటల వరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలుపడదు. దీనినే కూలింగ్ పీరియడ్ అని అంటారు.
- సెకెండరీ యూజర్లు చేసే ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ ప్రైమరీ యూజర్ ట్రాక్ చేయగలుగుతారు.
- యూపీఐ పేమెంట్స్ విఫలమైనప్పుడు, కస్టమర్లకు అందించాల్సిన పరిహారం విషయంలో, టర్న్-అరౌండ్ టైమ్ విషయంలో ఆర్బీఐ గైడ్‌లైన్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
UPI ద్వారా రాంగ్ నంబర్‌కు డబ్బులు పంపించారా? డోంట్ వర్రీ - ఇకపై 24 గంటల్లోనే రీఫండ్! - UPI Wrong Transaction Refund
మీరు క్రెడిట్ కార్డ్ యూజర్లా? CPPతో ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందండిలా! - Credit Card Protection Plans