Startup Registration Process In India : భారతదేశంలో స్టార్టప్‌లకు మంచి అనుకూల వాతావరణం ఉంది. అందుకే స్టార్టప్‌లను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. మరి మీరు కూడా మంచి స్టార్టప్ ప్రారంభిద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో స్టార్టప్‌లను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
స్టార్టప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే!
- మీ బిజినెస్‌ను ఇన్కార్పొరేట్ చేయండి
ముందుగా మీ స్టార్టప్‌ను ఎలా మొదలు పెట్టాలో నిర్ణయించుకోవాలి. అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ/ పార్ట్నర్షిప్ ఫర్మ్ (భాగస్వామ్య సంస్థ)/ లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్ ఆప్షన్లలో ఒకదానిగా మీ స్టార్టప్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ కోసం మీ ప్రాంతంలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కి అప్లికేషన్‌ను సమర్పించాలి. అందుకు అవసరమైన పత్రాలు, రుసుములను చెల్లించాలి. - స్టార్టప్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్
ఆ తర్వాత మీ బిజినెస్‌ను స్టార్టప్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చు. స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆపై మీ ఈ-మెయిల్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. తరువాత యూజర్ టైప్, పేరు, స్టేజ్ ఆఫ్ స్టార్టప్ వంటి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ఈ వివరాలను నింపిన తర్వాత స్టార్టప్ ఇండియా వైబ్సైట్లో మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆపై ఇంక్యుబేటర్/మెంటార్షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లెర్నింగ్ రిసోర్సెస్, ఫండింగ్ ఆప్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటివి తెలుసుకోవచ్చు. - డీపీఐఐటీ రికగ్నిషన్
ఆ తర్వాత 'స్టార్టప్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (డీపీఐఐటీ) గుర్తింపును పొందాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు వల్ల మీకు మేథో సంపత్తి సేవలు, వనరులు లభిస్తాయి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ నిబంధనల్లోనూ సడలింపులు వర్తిస్తాయి. కార్మిక, పర్యావరణ చట్టాల ప్రకారం, స్వీయ ధ్రువీకరణ చేసుకోవచ్చు. కంపెనీ వైండింగ్‌కు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు అనేక రకాల పన్ను మినహాయింపులు లభిస్తాయి. డీపీఐఐటీ రికగ్నిషన్ పొందడానికి స్టార్టప్ ఇండియా వెబ్సైట్లో మీ రిజిస్టర్డ్ ప్రొఫైల్ వివరాలతో లాగిన్ కావాలి. రికగ్నిషన్ ట్యాబ్ కింద ఉన్న 'అప్లై ఫర్ డీపీఐఐటీ రికగ్నిషన్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో ఉన్న 'అప్లై నౌ'పై క్లిక్ చేయాలి. అప్పుడు 'నేషనల్ సింగిల్ విండో సిస్టమ్' (NSWS) వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కంపెనీలు, ఎల్ఎల్పీలు రిజిస్టర్ చేసుకోవాలి. డీపీఐఐటీ గుర్తింపు పొందడానికి 'రిజిస్ట్రేషన్ యాజ్ ఏ స్టార్టప్' ఫారమ్‌ను యాడ్ చేయాలి. తర్వాత 'స్టార్టప్ రికగ్నిషన్ ఫారమ్' నింపాలి. - రికగ్నిషన్ అప్లికేషన్
స్టార్టప్ రికగ్నిషన్ ఫారమ్‌లో మీ స్టార్టప్ వివరాలు, కార్యాలయం పూర్తి చిరునామా, అధీకృత ప్రతినిధి వివరాలు, డైరెక్టర్లు/భాగస్వాముల వివరాలు, మీ వ్యాపార కార్యక్రమాల వివరాలు నమోదు చేయాలి. అలాగే సెల్ఫ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఫారమ్ కుడి వైపున ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి అందులోని అన్ని సెక్షన్లను ఎంటర్ చేయాలి. టెర్మ్స్ అండ్ కండిషన్స్‌ను అంగీకరించి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. - ఈ పత్రాలు ఉండాలి
మీ స్టార్టప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫండింగ్ ప్రూఫ్, పేటెంట్, ట్రేడ్‌మార్క్ వివరాలు, అవార్డుల జాబితా, గుర్తింపు సర్టిఫికెట్లు, పాన్ నంబర్ వంటివి స్టార్టప్ రిజిస్ట్రేషన్ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే మీ స్టార్టప్‌నకు సంబంధించిన పిచ్డెక్, వీడియో, వెబ్సైట్ లింక్‌లను కూడా ఇవ్వాలి. అంతే సింపుల్! - గుర్తింపు సంఖ్య జారీ
స్టార్టప్ దరఖాస్తు పూర్తయిన తర్వాత మీకు ఒక గుర్తింపు సంఖ్య (రికగ్నిషన్ నంబర్) వస్తుంది. సాధారణంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 2 రోజులలోపు మీ అన్ని పత్రాల పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత మీకు గుర్తింపు (రికగ్నిషన్) సర్టిఫికెట్ జారీ అవుతుంది. - పేటెంట్, ట్రేడ్‌మార్క్ కోసం
మీ ఆవిష్కరణకు పేటెంట్ రావాలన్నా, లేదా మీ బిజినెస్‌కు ట్రేడ్‌మార్క్ కావాలన్నా, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఫెసిలిటేటర్ల జాబితాలోని ఎవరినైనా సులభంగా సంప్రదించవచ్చు. అయితే ఇందుకోసం మీరు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.