Union Budget 2025 :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో విద్య, వైద్య, వైమానిక, పర్యటక రంగాలకు భారీ ఎత్తున కేటాయింపులు చేశారు.
ఆరోగ్య రంగానికి రూ.93వేల కోట్లు కేటాయింపు
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి రూ.98,311 కోట్లను కేటాయించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో 'డేకేర్ క్యాన్సర్' సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. అందులో 200 డేకేర్ క్యాన్సర్ సెంటర్లను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు,ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించేందుకు ప్రాణాలు కాపాడే 36 ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించారు.
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పిస్తామని సీతారామన్ చెప్పారు. ఇది కోటి మంది గిగ్ కార్మికులకు దోహదపడుతుందని తెలిపారు. రానున్న ఐదేళ్లలో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 75వేల వైద్య సీట్లను పెంచుతామన్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాదిలో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 10 వేల అదనపు సీట్లను కల్పిస్తామని ఆమె చెప్పారు.
"రానున్న మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. 200 కేంద్రాలను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ గిగ్ వర్కర్లు న్యూ ఎయిడ్ సర్వీసెస్ ఎకానమీలో గొప్ప సహకారం అందిస్తున్నారు. గిగ్ వర్కర్ల సహకారాన్ని గుర్తిస్తూ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి ఈ-ఫారమ్ పోర్టల్‌లో కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పిస్తాం. ఇది కోటి మంది గిగ్ వర్కర్లకు దోహదపడుతుంది."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
విద్యారంగానికి రూ.1.28 లక్షలు
2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌లో విద్యరంగానికి రూ.1,28,650 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలోని 23 ఐఐటీల్లో పదేళ్లలో సీట్ల సంఖ్యను వంద శాతం పెంచుతామన్నారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో 6,500 మంది విద్యార్థులకు విద్య అందించేలా అదనపు మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్నాలోని ఐఐటీలో హాస్టల్, ఇతర మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో ఐఐటీ, ఐఐఎస్సీలలో సాంకేతిక పరిశోధన కోసం 10వేల ఫెలోషిప్‌లను అందించనున్నట్లు ప్రకటించారు. ఐదు జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్, పీహెచ్‌సీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. విద్య కోసం ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌ను 500 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. పాఠ్యపుస్తకాలను డిజిటల్‌గా అందించేందుకు 'భారతీయ భాషా పుస్తక్' పథకాన్ని ప్రారంభిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.