Salaried Taxpayer ITR Filing :మీరు పన్ను చెల్లింపుదారులా? జీతం ద్వారా ఆదాయం పొందుతున్నారా? అయితే ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏమైనా పొరపాట్లు చేస్తే, భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. లీగల్ ప్రోబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఐటీఐఆర్ ఫైల్ చేయడానికి జులై 31 వరకు గడువు ఉంది. కనుక ఐటీఐఆర్ ఫైల్ చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు, ఫారాలు సహా, ఇతర సమాచారాన్ని సేకరించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడానికి వీలవుతుంది.
లింక్ చేసుకోవాలి!
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు, మీ పాన్-ఆధార్ కార్డ్‌లను లింక్ చేసుకోవాలి. ఒక వేళ మీ ఆధార్-పాన్ కార్డులను లింకు చేయకపోతే, రీఫండ్ రావడం కష్టమవుతుంది. మీ బ్యాంక్ ఖాతా వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, మీరు కోరుకున్న బ్యాంక్ ఖాతాలోనే రీఫండ్ సొమ్మును జమ చేస్తారు.
సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం ముఖ్యం:
ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడం కోసం సరైన ఫారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు పొరపాటున వేరే ఫారాన్ని దాఖలు చేస్తే, దానిని తిరస్కరిస్తారు. అందుకే సాలరీడ్ ట్యాక్స్ పేయర్స్ ITR-1 ఫారంను ఎంచుకోవాలి.
ITR-1 ఫారమ్ అంటే ఏమిటి?
మీరు భారతదేశంలో నివసిస్తూ ఉండి, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువగా ఉంటే ITR-1 ఫారమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు వచ్చే ఆదాయం - జీతం, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం, కుటుంబ పెన్షన్, వ్యవసాయ ఆదాయం (గరిష్ఠంగా రూ.5,000 వరకు), పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ, డిపాజిట్లు, కాంపన్సేషన్స్ నుంచి మాత్రమే వచ్చి ఉండాలి.
ITR-1ను ఎవరు ఫైల్ చేయలేరు!
- మీరు భారతీయ పౌరుడు కాకపోతే, మీరు ITR-1ని ఫైల్ చేయలేరు.
- మీ మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఐటీఆర్-1 ఫైల్ చేయలేరు.
- మీరు లాటరీ, గుర్రపు పందెం, చట్టపరమైన బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తే ఐటీఆర్-1 ఫైల్ చేయలేరు.
- క్యాపిటల్ గెయిన్స్ పొందినప్పుడు మీరు ITR -1 ఫారం దాఖలు చేయలేరు.
- అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా ఐటీఆర్ - 1 దాఖలు చేయలేరు.