Ratan Tata Excellence In Automobile Industry : కలల కారుమేఘాల్లో విహరించాలనే మధ్యతరగతి వారి ముచ్చట తీర్చాలని రతన్ టాటాకు చిరకాల కోరిక. అందుకే వారి అభిరుచికి తగ్గట్లుగా అందుబాటు ధరలోనే ఓ పూర్తి స్వదేశీ కారు తేవాలని ఆయన అభిలాష. అలాంటి ఆలోచనల నుంచే ఆవిష్కృతమైందే రతన్ టాటా మానసపుత్రిక 'టాటా ఇండికా'. సింపుల్‌గా, ఓ ఫ్యామిలీకి తగ్గట్లుగా డిజైన్ చేసిన ఈ కారును ఆ సంస్థ గ్రాండ్‌గానే లాంఛ్ చేసింది. కానీ అప్పటి మార్కెట్ ట్రెండ్స్‌లో కాస్త డీలా పడింది. దీంతో తొలి ఏడాదే ఆ సంస్థకు కొన్ని వందల కోట్ల నష్టాలు వచ్చాయి.
ఆ సమయంలో కంపెనీ డైరెక్టర్లు కొందరి సలహా మేరకు 'ఇండికా'ను ఫోర్డు కంపెనీకి విక్రయించాలని రతన్ టాటా నిర్ణయించారు. అలా టాటా ప్రతినిధి బృందంతో డెట్రాయిట్ వెళ్లి చర్చలకు కూడా కూర్చున్నారు. అయితే అక్కడ ఆయన్ను ఫోర్డు కంపెనీ ఛైర్మన్ ఎగతాళిచేశారు. "అనుభవం లేనిదే ప్యాసింజర్ కారు తయారీకి తగుదునమ్మా అంటూ దిగారు" అని అన్నారు. "మీ కారు బ్రాండును కొనటం ద్వారా మేము మీకు గొప్ప మేలు చేస్తున్నాం" అని చులకనగా మాట్లాడారు. దీంతో రతన్ టాటా ఆ చర్చలను అంతటితో ముగించి ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అయినప్పటికీ కారెక్కాలన్న మధ్య తరగతి ముచ్చటను తీర్చడంలో రతన్ టాటా ఏమాత్రం రాజీపడలేదు.
అవమానించిన వ్యక్తికి సాదర ఆహ్వానం
2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కమ్మింది. ఆటోమొబైల్ రంగంలో పేరుగాంచిన ఫోర్డు కంపెనీ గిజగిజలాడింది. ఎవరు కొంటారా అంటూ జాగ్వార్, ల్యాండ్ రోవర్ల ఉత్పత్తి కేంద్రాలను విక్రయించాలని నిర్ణయిచింది. సరిగ్గా అదే సమయంలో రతన్ టాటా రంగప్రవేశం చేశారు. 'అనుభవం లేదు కార్ల తయారీలోకి ఎందుకొచ్చావు?' అని తనను అవమానించిన ఫోర్డు కంపెనీ ఛైర్మన్‌ను ముంబయికి సాదరంగా ఆహ్వానించి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అలా జాగ్వార్, ల్యాండ్ రోవర్లను $1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. నాడు మాట జారిన ఫోర్డు చైర్మన్ మీద రతన్ టాటా తీయగా ప్రతీకారం తీర్చుకున్నారంటూ ఆర్ధిక విశ్లేషకులు చెణుకులు విసిరారు.
అయితే ఆర్థిక మాంద్యం కమ్మినా టాటా మోటార్స్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ల కొనుగోలుతో ఖరీదైన తప్పిదం చేసిందంటూ మార్కెటింగ్ నిపుణుల విశ్లేషణలను కార్ల ప్రియుడు, కార్లబఫ్గా పేరున్న రతన్ టాటా ఖాతరు చేయలేదు. దీంతో జాగ్వార్, లాండ్రోవర్ కొత్త మోడల్స్‌తో విక్రయాల్లో దూసుకెళ్లింది. టాటా మోటార్స్‌కు కామధేనువుగా మారింది. చైనాలో టాటా కంపెనీకి వచ్చే టర్నోవర్‌లో 50శాతం ఆటోమొబైల్ వ్యాపారం నుంచే వస్తోంది. ఈ బ్రాండ్లు అనేక దేశాల్లో ఆదరణ పొందాయి. అందులో జాగ్వార్, ల్యాండ్ రోవర్ వాటానే ఎక్కువ ఉండటం విశేషం.
ఓ కుటుంబ ప్రమాదకర ప్రయాణం - లక్ష కారుతో గెలుపు పాఠం
రత్నాలైనా కఠినంగా ఉండచ్చేమో కానీ రతన్ టాటా మనసు మాత్రం వెన్న. ఉక్కు కొలిమిలో పనిచేసిన రాటుదేలిన ఆయనలో ఓ మృదువైన కోణం ఆవిష్కృతమైంది. కేవలం ఉన్నత వర్గాల ముచ్చట తీర్చిన రతన్ టాటా మధ్యతరగతి వర్గాల ముచ్చట తీర్చాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే వారికి ఓ విలువైన కానుక ఇచ్చారు. అలా ఆయన ఆలోచనల నుంచే ఓ లక్షణమైన లక్ష కారు వచ్చేసింది. అదే 'నానో' కారు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబయిలో ఓ కుటుంబం చేసిన ప్రమాదకర ప్రయాణం ఆయన స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ నానో కారు. గుజరాత్‌లోని సనద్‌లో టాటా మోటార్స్ యూనిట్లో తయారైన ఈ కారు దేశమంతా దుమ్మురేపింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యింది. రతన్ టాటా నానో కారు దేశవిదేశాల్లో అనేక బిజినెస్ స్కూళ్లలో గెలుపుపాఠంగా సిలబస్‌లో చేరింది.
చిన్న కార్లు బెస్ట్ సెల్లర్లు
2001 నాటికి టాటా ఇండికా, టాటా విస్తా, ఆ తర్వాతి కాలంలో క్వాడ్రజెట్ ఇంకా అనేక మోడళ్లతో చిన్నకార్లు మార్కోట్లోకి వచ్చి దేశంలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (SUV) మోడల్లో 1991లో టాటా సియారా భారతీయ రహదారులెక్కింది. ఇది విజయవంతమైన ఉత్సాహంతో దూసుకొచ్చాయి. 1994లో టాటా మోటార్స్ మాజీ ఎండీ సుమంత్ మూల్గావ్కర్ పేరుతో టాటా సుమో వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు. దేశవిదేశాల నుంచి టాటా సుమో కోసం భారీ ఆర్డర్లు వచ్చాయి.