Ratan Tata Hospitalized :ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన రతన్ టాటా, తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఐసీయూలో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
వృద్ధాప్య సమస్యలు మాత్రమే!
బీపీ లెవల్స్ పడిపోవడం వల్ల 86 ఏళ్ల రతన్ టాటా ఈ ఉదయం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారని సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి. ఆయనను ఐసీయూలో చేర్చినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో రతన్ టాటా తన 'ఎక్స్' ఖాతాలో ప్రకటన విడుదల చేశారు.
"నా గురించి ఆలోచిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వయస్సు రీత్యా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నా. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ప్రజలను, మీడియాను కోరుతున్నాను"
- రతన్ టాటా ట్వీట్
టాటా లెగసీ
86 ఏళ్ల రతన్ టాటా దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఒకరు. ఆయన ఒక గొప్ప మానవతా వాది కూడా. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. కొంత కాలం కిందట ఆయన టాటా కంపెనీ ఛైర్మన్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలిగారు. ప్రస్తుతం గౌరవ ఛైర్మన్ హోదాలో ఉంటూ కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన టాటా గ్రూప్‌నకు చెందిన ఛారిటబుల్ ట్రస్టులకు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారు.