LPG Gas Cylinder Price Reduced :మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుడ్‌న్యూస్ చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల లక్షలాది కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా 'నారీశక్తి'కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వంటగ్యాస్‌ను అందుబాటు ధరలో అందించటం వల్ల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునిస్తున్నామని చెప్పారు. తద్వారా వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 955గా ఉండగా కేంద్రం తాజా నిర్ణయంతో రూ.855కి చేరనుంది. దేశ రాజధాని దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 903గా ఉండగా ఇప్పుడు రూ. 803కు తగ్గనుంది. కోల్‌కతాలో రూ.929గా ఉండగా రూ.829కు తగ్గింది. ముంబయిలో రూ.802.50కు తగ్గింది.
మరోవైపు, ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరం(2024-25) వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. కాగా, మార్చి 31వ తేదీతో సబ్సిడీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్రం. అలాగే రక్షాబంధన్ సందర్భంగా గతేడాది సిలిండర్ ధరను కేంద్రం రూ.200 తగ్గించింది.