How To File ITR Via WhatsApp :ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ. ఎంతగా ఈజీ అంటే? చివరకు మన వాట్సాప్ నుంచి కూడా ఐటీఆర్‌ను ఫైల్ చేసేయొచ్చు. ClearTax వేదిక ద్వారా మనం ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. ప్రస్తుతానికి వాట్సాప్ నుంచి మనం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్‌లను ఆదాయపు పన్నుశాఖకు సమర్పించవచ్చు. ఈ ఫామ్‌లు అతితక్కువ ఆదాయ వర్గాల వారికి సంబంధించినవి. అంటే దేశంలోని సామాన్యులు వాట్సాప్‌లోనే క్లియర్ ట్యాక్స్ (ClearTax) వేదిక ద్వారా సులభంగా ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
వాట్సాప్‌లో ఐటీఆర్ ఫైలింగ్ ఇలా!
- తొలుత క్లియర్ ట్యాక్స్ కంపెనీకి చెందిన వాట్సాప్ అఫీషియల్ నంబర్‌కు మెసేజ్ పంపించాలి.
- మనం మెసేజ్‌ను పంపిన తర్వాత, ఐటీఆర్ దాఖలుకు సంబంధించిన డిజిటల్ ప్రక్రియను క్లియర్ ట్యాక్స్ టీమ్ మొదలుపెడుతుంది.
- మన ప్రాథమిక వివరాలను వారికి వాట్సాప్‌లోనే అందించాలి.
- చివర్లో మనకు ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫామ్‌లను చూపిస్తారు.
- మన అవసరాలకు సరిపోయే ఐటీఆర్ ఫామ్‌ను ఎంపిక చేసుకొని, దానిలో వివరాలను నమోదు చేయాలి.
- రూ.5వేలలోపు వ్యవసాయ ఆదాయం కలిగిన రైతులు ఐటీఆర్-1 ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి.
- రూ.5వేలకుపైగా వ్యవసాయ ఆదాయం కలిగిన రైతులు ఐటీఆర్-2 ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ఈ ఫామ్‌లు నింపే క్రమంలో పన్ను చెల్లింపుదారులు అవసరమైన సమాచారాన్ని ఫొటోలు, ఆడియో, టెక్ట్స్ రూపంలో అందించవచ్చు. ఇందులో వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, అవసరమైన పత్రాలు ఉంటాయి.
- క్లియర్ ట్యాక్స్ కంపెనీ ఐటీఆర్ ఫైలింగ్ సేవలను ప్రస్తుతం 10 భాషలలో అందిస్తోంది. ఈ జాబితాలో ఇంగ్లీష్, హిందీ, కన్నడం సహా పలు భాషలు ఉన్నాయి.
ఐటీఆర్ - 1 ఫామ్ అంటే?
ఐటీఆర్ -1 ఫామ్‌ను ‘సహజ్’ అని కూడా పిలుస్తారు. పెన్షన్, జీతం, ఇంటి అద్దె, ఇతర వనరుల ద్వారా ఆదాయం సంపాదించే వారు ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఈ ఫామ్‌ను ఎంపిక చేసుకోవాలి. బెట్టింగ్, జూదం, లాటరీల ద్వారా ఆదాయం ఆర్జించేవారు ఈ ఫామ్ నింపడానికి వీలుండదు.