Registered Startups In India : ప్రస్తుతం మన దేశంలో 1.4 లక్షలకుపైగాస్టార్టప్స్ ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. ఇవన్నీ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) నుంచి గుర్తింపు పొందిన నమోదిత సంస్థలని ఆయన తెలిపారు. ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో మహారాష్ట్ర ఉందని, అక్కడ అత్యధికంగా 25,044 నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. రెండో స్థానంలో కర్ణాటక (15,019 స్టార్టప్స్), మూడో స్థానంలో దిల్లీ (14,734 స్టార్టప్స్), నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ (13,299 స్టార్టప్స్), ఐదో స్థానంలో గుజరాత్ (11,436 స్టార్టప్స్) ఉన్నాయి. ఈ మేరకు వివరాలతో రాజ్యసభకు జితిన్ ప్రసాద రాతపూర్వక సమాచారాన్ని అందించారు.
స్వదేశీ మూలధనమే లభించేలా!
‘‘స్టార్టప్‌లకు ప్రారంభ దశ, విత్తన దశ, వృద్ధి దశలో ప్రభుత్వం మూలధనాన్ని అందిస్తోంది. వాటికి దేశీయ మూలధనం లభించేలా చేయడం, విదేశీ మూలధనంపై అవి ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్వదేశీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మద్దతుతో స్టార్టప్స్ వికసించాలనేది మా ప్రణాళిక’’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. 2016 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం ఎన్నో అంకుర సంస్థలకు దన్నుగా నిలిచిందన్నారు. ఇన్నోవేషన్ చేసే విషయంలో, పెట్టుబడులను సమీకరించే విషయంలో స్టార్టప్స్‌కు అండగా నిలబడిందని తెలిపారు. 19 అంశాలతో కూడిన యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తూ స్టార్టప్‌ల వికాసానికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోందని జితిన్ అన్నారు. ఈ క్రమంలోనే స్టార్టప్‌ల కోసం రాయితీల కల్పన, ప్రోత్సాహకాల పంపిణీ, పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమ వర్గాల సహకారం లభించేలా ఏర్పాట్లు చేయడం వంటివన్నీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.