How To Increase Credit Card limit :మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులను బ్యాంకులు కొంత లిమిట్‌తో తమ కస్టమర్లకు అందిస్తాయి. వీటిని జారీ చేసే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అందులో వ్యక్తి ఆదాయం, సకాలంలో చెల్లింపులు చేయడం లాంటివి ప్రధానంగా ఉంటాయి. ఇలాంటి వాటిని మేనేజ్ చేస్తే క్రెడిట్ కార్డు లిమిట్ సులభంగా పెరుగుతుంది!.
సకాలంలో బకాయిల చెల్లింపులు
రుణదాతలు క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచేందుకు, కొత్తగా ఇచ్చేందుకు మీ క్రెడిట్ హిస్టరీని నిశితంగా పరిశీలిస్తారు. అందుకే మునుపటి నెలల నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల బకాయిలు ఏవైనా ఉంటే కట్టేయాలి. గడువు తేదీకి ముందే బిల్లులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేయడం వల్ల బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు లిమిట్‌ను పెంచే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ వినియోగం
క్రెడిట్ బ్యూరో సంస్థలు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాల్లో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్) కూడా ఒకటి. క్రెడిట్ కార్డు కస్టమర్‌కు అనుమితించిన పరిమితిలో ఎంత మొత్తం వినియోగించారో సీయూఆర్ తెలియజేస్తుంది. అందుకే సీయూఆర్ 30 శాతానికి మించనివ్వొద్దు. తక్కువ సీయూఆర్ వినియోగం కూడా క్రెడిట్ కార్డు పరిమితిని పెంచడంలో సాయపడుతుంది. అందుకే తక్కువ సీయూఆర్ తక్కువ ఉండేలా చూసుకోవాలి.
ఆదాయం
క్రెడిట్ లిమిట్‌ను పెంచే విషయంలో రుణదాతలు కస్టమర్ల ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మీ ఆదాయం ఇటీవల పెరిగినట్లైతే అందుకు సంబంధించిన ఫ్రూఫ్‌ను క్రెడిట్ కార్డు జారీ సంస్థలకు అందజేయాలి. అప్పుడు క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఈఎమ్ఐల ప్రభావం
క్రెడిట్ కార్డు పరిమితిని పెంచమని జారీ సంస్థలను కోరే ముందు హోమ్ లోన్, వ్యక్తిగత రుణం ఈఎమ్ఐలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వీలైతే వాటిని కట్టేయండి.
కొత్త కార్డు
మీరు వాడుతున్న ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌లో అధిక బ్యాలెన్స్ ఉందనుకోండి. అప్పుడు పాత కార్డును అధిక పరిమితితో కొత్త కార్డ్‌కు బదిలీ చేయడం వల్ల మీ రుణాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది.