తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యవసరంగా డబ్బులు కావాలా? ఇన్‌స్టాంట్‌ పర్సనల్ లోన్ పొందండిలా! - HOW TO GET INSTANT PERSONAL LOAN

ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాంట్‌ పర్సనల్‌ లోన్‌ కోసం అప్లై చేయాలా? ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి!

instant personal loan
instant personal loan (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 3:41 PM IST

How To Get Instant Personal Loan :ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ విధంగా వస్తాయో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇళ్లు, పొలాలు, బంగారం లాంటివి తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఈ రుణాలు మంజూరు కావడానికి కాస్త సమయం పడుతుంది. ఒక వేళ ఇలాంటి స్థిరాస్తులు లేకపోతే రుణం పొందడం కష్టమవుతుంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు కూడా ఏదో ఒక హామీ లేకుండా అప్పు ఇవ్వరు. పైగా అధిక వడ్డీ వసూలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కరకు వచ్చేవి వ్యక్తిగత రుణాలు. వీటికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు విధించే వడ్డీ కంటే, బ్యాంకులు విధించే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది.

ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
బ్యాంకుల దృష్టిలో వ్యక్తిగత రుణాలు అసురక్షితమైనవి. అయితే ఈ లోన్స్‌ పొందడానికి మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లోనే నేరుగా అప్లై చేసుకోవచ్చు. కనుక ఈ అప్లికేషన్ ప్రాసెస్‌ సింపుల్‌గా, త్వరగా పూర్తి అయిపోతుంది. డబ్బులు కూడా వేగంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతాయి.

ఎవరికి వ్యక్తిగత రుణాలు ఇస్తారు?

  • వ్యక్తిగత రుణాలు పొందాలంటే, రుణగ్రహీతకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే కొన్ని బ్యాంకులు 21 ఏళ్లు నిండిన వ్యక్తులకే రుణాలు ఇస్తుంటాయి.
  • బ్యాంకులు మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి రుణాలు ఇచ్చేందుకు ఇష్టపడుతుంటాయి. సాధారణంగా సిబిల్‌ స్కోర్ 750 లేదా అంత కంటే ఎక్కువ ఉంటే మంచిది. దీని వల్ల తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, రుణాలు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. లేదా అధిక వడ్డీ వసూలు చేయవచ్చు.
  • సాధారణంగా ఉద్యోగం చేసేవారికి బ్యాంకులు సులువుగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఎందుకంటే వారికి స్థిరాదాయం ఉంటుంది. దానికి రుజువుగా సాలరీ స్లిప్ ఉంటుంది. కానీ స్వయం ఉపాధి పొందేవారు వ్యక్తిగత రుణాలు పొందాలంటే, తమ ఆదాయ మార్గాల గురించి, రుణం తీర్చే సామర్థ్యం గురించి బ్యాంకులకు వివరించాల్సి ఉంటుంది.

ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!
ఆర్‌బీఐ గైడ్‌లైన్స్, బ్యాంకు నిబంధనలు అనుసరించి వ్యక్తిగత రుణాల కోసం అప్లై చేసే విధానం ఉంటుంది. ఈ వ్యక్తిగత రుణం పొందాలంటే, ఈ క్రింది ప్రాసెస్ ఫాలో అవ్వాలి.

  • ముందుగా మీరు ఎంచుకున్న బ్యాంక్ పోర్టల్‌లోకి వెళ్లి, మీ వ్యక్తిగత, ఆదాయ వివరాలు నమోదు చేయాలి. అలాగే ఆధార్, పాన్ కార్డులతో లింక్ చేసిన మొబైల్‌ నంబర్‌లను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే బ్యాంకు మీ వివరాలు అన్నింటినీ చెక్ చేసి, రుణ అర్హత (లోన్ ఎలిజిబిలిటీ) ఉందో, లేదో చెక్‌ చేస్తుంది. ఒక వేళ రుణార్హత ఉంటే, లోన్ మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంది. (ఒక వేళ మీకు ప్రీ-అప్రూవ్డ్‌ లోన్ ఆఫర్‌ ఉంటే, ఈ స్టెప్ స్కిప్ చేయవచ్చు.)
  • మీకు కనుక రుణార్హత ఉంటే, వెంటనే మీకు ఎంత డబ్బు కావాలో, ఎంత కాలవ్యవధి కావాలో ఎంపిక చేసుకోవాలి. వీలైనంత వరకు మీ ఆర్థిక అవసరాలకు, సులువుగా రుణం తీర్చేందుకు వీలుగా వీటిని ఎంచుకోవడం మంచిది.
  • ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయితే చాలు, 24 గంటల్లోనూ ఆ లోన్ అమౌంట్‌ మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

వ్యక్తిగత రుణాల వల్ల కలిగే లాభాలు ఏమిటి?

  • పర్సనల్ లోన్స్ కోసం మీరు బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లోనే చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చు.
  • బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీలు అడగవు. కనుక సులువుగా లోన్ పొందవచ్చు. అయితే వడ్డీ రేట్ల విషయంలో కాస్త జగ్రత్తగా ఉండాలి.
  • ఇతర రుణాలతో పోల్చితే పర్సనల్ లోన్స్‌ త్వరగా వస్తాయి. లోన్‌ మంజూరు అయిన కొన్ని గంటల వ్యవధిలోనే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయి.
  • మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తిగత రుణం ఎంత కాలవ్యవధిలో తీర్చగలరో మీరే నిర్ణయించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మీ నెలవారీ ఈఎంఐ ఎంత ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు గడువు కంటే ముందే రుణం తిరిగి చెల్లించాలనుకుంటే చెల్లించవచ్చు. కొన్ని బ్యాంకులు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తాయి. మరికొన్ని ఈ ప్రీపేమెంట్ ఛార్జీలు లేకుండానే రుణాన్ని క్లోజ్ చేస్తాయి.

నోట్‌ : వ్యక్తిగత రుణాలను ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే, మిగతా బ్యాంకు లోన్స్‌తో పోల్చితే వీటి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా సకాలంలో వీటిని చెల్లించకపోతే, మీరు డిఫాల్ట్ అవుతారు. కనుక సిబిల్ స్కోర్ తగ్గుతుంది. భవిష్యత్‌లో బ్యాంకు రుణాలు పొందడం కష్టం అవుతుంది.

నోట్‌ :ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

పర్సనల్ లోన్​​ కావాలా? తక్కువ 'వడ్డీ' తీసుకునే బ్యాంక్స్ ఇవే!

పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? ముందుగా ఈ 6 'హిడెన్ ఛార్జీ'ల గురించి తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details