How To Choose Best Insurance Policy : అందరూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత అవసరాలకు వాడుకుని, మరి కొంత పొదుపు చేస్తుంటారు. లేదా అధిక రాబడిని ఇచ్చే స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలా పోగు చేసిన డబ్బుతో భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలు తీర్చుకోవచ్చని భావిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అత్యవసరాలకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. కానీ జీవితంలో అన్నీ అనుకున్న విధంగానే జరగవు. అనుకోని ప్రమాదాలు ఏరోజైనా తలుపు తట్టవచ్చు. దురదృష్టవశాత్తు కుటుంబానికి ఆధారమైన ఇంటి పెద్ద మరణించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అప్పటి వరకు కన్న కలలు వృథా అవ్వాల్సిందేనా? అందరూ ఆర్థిక భారం మోయాల్సిందేనా? వాస్తవానికి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవచ్చు. సరైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఈ కష్టాల నుంచి కుటుంబాన్ని రక్షించవచ్చు. అందుకే మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే సరైన బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్సూరెన్స్ కీలకం
ఇన్సూరెన్స్ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఆరోగ్య అవసరాలు, రోడ్డు ప్రమాదాలు, అకాల మరణం నుంచి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మృతి చెందితే, నామినీకి పరిహారం అందుతుంది. ఈ పరిహారం మొత్తం కుటుంబ అవసరాలకు, అప్పులు తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు.
ఇన్సూరెన్స్ రైడర్లు
ఇన్సూరెన్స్ రైడర్లు అనేవి ఇప్పటికే ఉన్న పాలసీకి ఆప్షనల్ యాడ్-ఆన్‌లు. ఇవి అడిషినల్ కవరేజీని అందించి, అత్యవసర పరిస్థితుల నుంచి రక్షణ అందిస్తాయి. ఏదైనా ప్రత్యేక ప్రయోజనాల కోసం కొత్త పాలసీని కొనుగోలు చేయడం కంటే, కావలసిన రైడర్‌ను యాడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. పాలసీలకు యాక్సిండెంటల్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్, ప్రీమియం వేవర్ లాంటి రైడర్స్ ఉంటాయి. వీటిని యాడ్ చేసుకునేందుకు కొంత ప్రీమియం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంత పాలసీ అవసరం?
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఆర్థిక లక్ష్యాలు, బాధ్యతలు, ఆధారపడిన వారు, ఆదాయం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీని సెలక్ట్ చేసుకునే ముందు చెల్లించాల్సిన ప్రీమియం మాత్రమే చూడొద్దు. ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ ఇస్తోంది? క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో/ హిస్టరీ ఎలా ఉంది? కస్టమర్ల సమస్యలకు స్పందన ఎలా ఉంది? మొదలైన అంశాలను పరిశీలించాలి.