How To Choose Right ITR Form :సంపాదించినఆదాయంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధానం భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉంది. అందులో భాగంగానే నేడు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం మన దేశంలో సంపాదిస్తున్న ఆదాయం, నిర్దేశిత షరతుల ఆధారంగా ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4, ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7లను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. పన్ను చెల్లింపుదారుల ఆదాయ వనరులు, సంపాదించిన మొత్తం, పన్ను చెల్లింపుదారుడు ఏ కేటగిరీకి చెందినవాడు అనే విషయాల ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం ఎలా?
ప్రతి సంవత్సరం సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినITR ఫారాలను నోటిఫై చేస్తుంది. కింద పేర్కొన్న ఏవైనా షరతులు మీకు వర్తిస్తే, కచ్చితంగా మీరు ఆదాయ పన్ను రిటర్నలు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ITR-1 లేదా SAHAJ
భారతీయదేశంలో నివసిస్తున్న సాధారణ పౌరులై ఉండి, రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్న వ్యక్తులు ITR-1 ఫారమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జీతం, ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం, జీవిత భాగస్వామి లేదా బిడ్డల ద్వారా వచ్చిన ఆదాయాలు అన్నీ కలిపి రూ.50 లక్షల వరకు ఉంటే ఐటీఆర్-1 దాఖలు చేయాల్సిందే.
ITR-2
వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఐటీఆర్ ఫారమ్-2ను దాఖలు చేయాలి. రూ.50 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం కలిగిన వ్యక్తి, కంపెనీ డైరెక్టర్, జాబితా చేయని ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నవారు ఈ ఐటీఆర్ ఫారమ్-2 దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే జీతాలు, బహుళ గృహాలు, మూలధన లాభాలు కలిగినవారు; భారతదేశం వెలుపల ఆస్తులు, ఆదాయ మార్గాలు కలిగిన వారు ITR-2 ఫారమ్ తప్పనిసరిగా దాఖలు చేయాలి.
ITR-3
వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం, లాభాలు సంపాదిస్తున్న ఇండివిడ్యువల్ వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు ఐటీఆర్-3 సమర్పించాలి.
ITR-4 లేదా SUGAM
రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యుఎఫ్‌లు, సంస్థలు (ఎల్‌ఎల్‌పి కాకుండా); ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 44AD, 44ADA, 44AE ప్రకారం వృత్తి, వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులు ఐటీఆర్-4 దాఖలు చేయాలి.