How To Invest At Different Stages Of Life : చాలా మంది ఆర్థిక భద్రత కోసం, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇలా పెట్టుబడులు పెట్టేవారు ఏ వయస్సులో ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడులు పెడితే మంచిది? ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్‌గా ఉంటుంది? పెట్టుబడులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యుక్త వయసులో ఆదాయం తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతుంటారు. జీవితంలో త్వరగా సంపదను పోగుచేసుకోవాలంటే, చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించాలి. అప్పుడే చిన్నచిన్న రిస్కులను సైతం తట్టుకోగలుగుతారు. దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగిస్తే, మంచి కార్పస్‌ను (నిధి) సృష్టించుకోగలుగుతారు. మధ్య వయస్సున్న వ్యక్తులు ప్రధానంగా రియల్ ఎస్టేట్, బాండ్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది. దీనివల్ల ఆర్థిక వృద్ధి జరుగుతుంది. నష్టభయం తగ్గుతుంది. రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరపడినవారు, ఎలాంటి రిస్క్‌లేని, స్థిరమైన ఆదాయం ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే శేష జీవితం ఆర్థికంగా బాగుంటుంది.
20 నుంచి 30 మధ్య వయసున్నవారు ఎందులో పెట్టుబడులు పెట్టడం మంచిది?
20- 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అప్పుడప్పుడే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తారు. కెరీర్ ప్రారంభ దశలో ఉంటారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. అయితే యువతీయువకులు, యుక్త వయసులోనే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం వల్ల భవిష్యత్‌లో వారికి ఆర్థిక భద్రత చేకూరుతుంది. అందుకే యుక్త వయసులోనే లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు. అప్పుడే రిస్క్‌ను తట్టుకోగలుగుతారు. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు.
యువత 50:30:20నియమాన్ని పాటించి సత్ఫలితాలను పొందొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రకారం, మీ ఆదాయంలో 50 శాతాన్ని నిత్యావసరాల కోసం, 30 శాతాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, మిగిలిన 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే కెరీర్ తొలినాళ్లలోనే ఆర్థికంగా బలపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.