Fixed Vs Floating Home Loan Interest Rate :గృహ రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వడ్డీ రేట్లే మీపై ఆర్థిక భారం పెరిగేలా చేస్తాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాలపై 2 రకాల వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. అవి: స్థిర వడ్డీ రేటు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు. వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవచ్చు.
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు!
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అయితే ఈ ఫ్లోటింగ్ వడ్డీ రేటు సాధారణంగా, స్థిర వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది.
మీరు గృహ రుణంపై ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎంచుకుంటే బేస్ రేటును చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది తక్కువగా ఉంటుంది. బేస్ రేటు అనేది బ్యాంకులు నిర్ణయించిన బెంచ్‌మార్క్ రేటు లేదా కనీస వడ్డీ రేటు. సాధారణంగా బ్యాంకులు బేస్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వవు. అందువల్ల, బేస్ రేటు సవరించినప్పుడల్లా ఫ్లోటింగ్ రేటు కూడా మారుతుంటుంది. అయితే కొన్నిసార్లు స్థిర రేటు కంటే ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఫ్లోటింగ్ రుణాలపై వడ్డీ రేటు మారినప్పుడు, లోన్‌కు సంబంధించిన కాలవ్యవధిని సర్దుబాటు చేస్తుంటారు.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఎంచుకోవచ్చా?
ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎప్పుడు ఎంచుకోవచ్చు అంటే? భవిష్యత్తులో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని మీరు భావిస్తుంటే, ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎంచుకోవచ్చు. సాధారణంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఆ బ్యాంకు అందించే స్థిర వడ్డీ రేటు కంటే 1% నుంచి 2.50% తక్కువగా ఉండవచ్చు. కనుక మీరు నెలవారీగా కట్టాల్సిన ఈఎంఐ బాగా తగ్గుతుంది. ఒకవేళ మీరు ఈఎంఐ బదులు కాలపరిమితి తగ్గినట్లయితే లోన్ త్వరగా పూర్తయ్యి వడ్డీ ఆదా అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎంచుకునేవారు, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందవచ్చు.
ప్రయోజనాలు
వడ్డీ రేట్లు తగ్గుతున్న సందర్భంలో రుణగ్రహీతకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు లేదా బెంచ్‌మార్క్ రేటు తగ్గినప్పుడు ఫ్లోటింగ్ రేటు కూడా తగ్గుతుంది. అంటే మీ హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు తగ్గుతుంది. అంతేకాదు చాలా బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేటు ఇంటి రుణాల ముందస్తు చెల్లింపులపై పెనాల్టీని కూడా వసూలు చేయవు. అందువల్ల మీ దగ్గర ఉన్న మిగులు నిధులను వాడి అదనపు చెల్లింపులు చేయవచ్చు లేదా అదనపు ఖర్చులు లేకుండా ముందుగానే రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. దీర్ఘకాలిక రుణాలకు ఫ్లోటింగ్ రేటు ఇంటి రుణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సుదీర్ఘకాలంలో వడ్డీ రేటు తగ్గింపుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతికూలతలు
ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఇంటి రుణాన్ని ఎంచుకున్న వారికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఆర్‌బీఐ రెపోరేటు పెంచినప్పుడు, బెంచ్ మార్క్ రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు మీ ఇంటి రుణంపై చెల్లించాల్సిన వడ్డీ రేటు కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల, ఈఎంఐ భారం లేదా రుణ కాలవ్యవధి పెరుగుతుంది. అందుకే మీరు ఫ్లోటింగ్ రేటు ఎంచుకునేటప్పుడే ఈఎంఐ చెల్లించగలమా? లేదా? అనేది ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో చెల్లించాల్సిన ఈఎంఐ, రుణగ్రహీతలు చెల్లించగలిగే సామర్థ్యం కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఇది వారి పొదుపును, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల తక్కువ ఆదాయం సంపాదించే రుణగ్రహీతలు తీవ్రంగా ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈఎంఐ డిఫాల్ట్ అయితే, మీ క్రెడిట్ స్కోరు కూడా తగ్గిపోతుంది. అందుకే ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అన్ని విషయాలు ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాకుండా మీరు స్థిర వడ్డీ రేటుతో హోమ్ లోన్ తీసుకుంటే, మీరు చెల్లించాల్సిన ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. కనుక మీరు ముందే మీ ఆర్థిక ప్రణాళికను సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. కనుక ఈ రెండింటిలో మీకు ఏది అనువుగా ఉండే, దానిని ఎంచుకోవడం మేలు.
నోట్ :ఈ ఆర్టికల్‌లో చెప్పిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.
జియో Vs ఎయిర్‌టెల్ Vs వీఐ ప్లాన్స్ ధరలు పెంపు - ఇకపై వారికి మాత్రమే 5జీ! - JIO VS AIRTEL VS VI PLANS 2024
రూ.7 లక్షల్లో మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే! - Best Cars Under 7 Lakh